Roads on Moon: త్వరలో చంద్రుడిపై రోడ్లు ?

తాజాగా భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో(ISRO) చంద్రయాన్ 3 (Chandrayaan 3) ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో చంద్రుడి(Moon)పై పరిశోధనల్ని కొత్త పుంతలు తొక్కించేందుకు దేశాల మధ్య పోటీ పెరుగుతోంది. అదే సమయంలో చంద్రుడిపై మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ పని మరింత సులువవుతుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు.. అదే క్రమంలో అక్కడ రోడ్ల నిర్మాణం(Roads on moon) చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రుని ఉపరితలాన్ని మరింత నివాసయోగ్యంగా, నౌకాయానంగా మార్చే ప్రయత్నంలో యూరోపియన్ స్పేస్ […]

Share:

తాజాగా భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో(ISRO) చంద్రయాన్ 3 (Chandrayaan 3) ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో చంద్రుడి(Moon)పై పరిశోధనల్ని కొత్త పుంతలు తొక్కించేందుకు దేశాల మధ్య పోటీ పెరుగుతోంది. అదే సమయంలో చంద్రుడిపై మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ పని మరింత సులువవుతుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు.. అదే క్రమంలో అక్కడ రోడ్ల నిర్మాణం(Roads on moon) చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

చంద్రుని ఉపరితలాన్ని మరింత నివాసయోగ్యంగా, నౌకాయానంగా మార్చే ప్రయత్నంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రస్తుతం తలమునలై ఉంది. చంద్రునిపై రహదారుల నిర్మాణానికి తగిన ఉపరితలాలను రూపొందించడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తాజాగా ప్రారంభించింది. పేవర్ (PAVER) పేరుతో ఇందుకోసం ఓ ప్రాజెక్టును రూపొందిస్తోంది. చంద్రుడిపై ధూళిని ఎదుర్కొంటుూ అక్కడ భవిష్యత్తులో సునాయాసంగా ప్రయోగాలు చేసేందుకు ఈ ప్రాజెక్టు దారులు తెరవబోతోంది.

ప్రస్తుతం చంద్రుడిపై ఉన్న ధూళి అక్కడ ప్రయోగాలకు తీవ్ర అవరోధంగా ఉంది. దీనికి పరిష్కారం కనుగొంటే ప్రయోగాలు చాలా సులువుగా చేయొచ్చని భావిస్తున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA).. ఇందులో భాగంగా పేవర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. గతంలో అపోలో ప్రయోగం(Apollo launch) చేసినప్పుడు దాని లూనార్ రోవర్ లో ఫెండర్ ఈ ధూళితో కప్పబడిపోయింది. తద్వారా అది వేడెక్కి ఫెయిలైంది. అలాగే సోవియట్ యూనియన్ లునోఖోడ్ 2(Lunocode 2) రోవర్ రేడియేటర్ కూడా దుమ్ముతో కప్పబడినప్పుడు వేడెక్కడం వల్ల పనిచేయకుండా పోయింది. 

జర్మనీకి చెందిన బీఏఎం(BAM) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్, ఆలెన్ యూనివర్శిటీ, ఆస్ట్రియాలోని లిక్విఫెర్ సిస్టమ్స్ గ్రూప్, జర్మనీకి చెందిన క్లాస్టల్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలో ఇప్పుడు పేవర్(PAVER) ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ బృందం 12-కిలోవాట్ కార్బన్ డయాక్సైడ్ లేజర్‌ను ఉపయోగించి చంద్రుడిపై ధూళిని ఘన ఉపరితలంగా కరిగించి, సాఫీగా ఉపరితలాన్ని నిర్మించేందుకు ఉపయోగపడనుంది. 

ఈ ప్రక్రియలో త్రిభుజాకార, బోలు కేంద్రీకృత రేఖాగణిత ఆకృతులను దాదాపు 20 సెం.మీ మేర తయారు చేస్తారు. ఈ ఆకారాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి చంద్రుడి ధూళి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఘన ఉపరితలాలను నిర్మించడానికి, రోడ్లు లేదా ల్యాండింగ్ ప్యాడ్‌లుగా మార్చడానికి పనికొస్తాయి. ఫలితంగా వచ్చే పదార్థం గాజులాగా, పెళుసుగా ఉంటుంది కానీ క్రిందికి కుంగిపోకుండా తట్టుకోగలదు. అది విరిగిపోయినప్పటికీ దానిని వాడుకోవచ్చని, అవసరమైనప్పుడు మరమ్మతులు కూడా చేయవచ్చని శాస్త్రవేత్తలు(Scientists) చెప్తున్నారు.

ఇలా 100 చదరపు మీటర్ల ల్యాండింగ్ ప్యాడ్ రెండు సెంటీమీటర్ల మందంతో 115 రోజుల్లో నిర్మించబడుతుందని సైంటిస్టుల బృందం అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ స్పేస్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ ఓఎస్ఐపి (OSIP) ద్వారా ఈఎస్ఏ( ESA) బేసిక్ యాక్టివిటీస్ డిస్కవరీ ఎలిమెంట్ ద్వారా వచ్చిన ఆలోచలతో రూపుదిద్దుకుంది. వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నప్పుడు, రహదారి యోగ్యమైన ఉపరితలాల సృష్టి చంద్రుని అన్వేషణను సురక్షితంగా, మరింత సమర్థవంతంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు.

చంద్రుడిపై ఆక్సిజన్‌, ఐరన్, సిలికాన్‌, అల్యూమినియం లాంటి వాటిని వెలికితీసి.. సోలార్‌ సెల్స్‌(Solar cells), వైర్లు ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే, బ్లూ ఆరిజిన్‌ (Blue Origin)కంపెనీని నాసా(NASA) ఎంపిక చేసింది. వీటితోపాటు జాబిల్లిపై రాళ్లు తొలగించడానికి.. చంద్రుడిపై వదులుగా ఉండే మట్టిని గట్టిగా చేసి దాన్ని కరిగించి ఘన ఉపరితలంగా మార్చడానికి ఉపయోగించే యంత్రాల అభివృద్ధి బాధ్యతలను రెడ్‌వైర్‌ అనే సంస్థకు అప్పగించింది. వాటితో దుమ్ము, ధూళి లేని ప్రదేశాలతో పాటు చంద్రుడిపై కట్టే ఇళ్లకు పునాదులు, రోడ్లు, ల్యాండింగ్‌ ప్యాడ్‌లను సిద్ధం చేయవచ్చు. ప్లుటోనియం విద్యుదుత్పత్తి వ్యవస్థకు ప్రత్యామ్నాయ సాధనాల కోసం చాలాకాలం పాటు వచ్చే, వెలుపలి ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగే రేడియో ఐసోటోపిక్‌ విద్యుత్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి జెనోపవర్‌ సిస్టమ్స్‌ను ఎంపిక చేశారు.