కెనడా ప్రధాని పదవి నుంచి దిగిపోతున్నారా? 

తాను ప్రధాని పదవి నుంచి దిగిపోతానంటూ జరుగుతున్న ప్రచారంపై కెనడా పీఎం జస్టిన్ ట్రూడో స్పందించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, తాను చేయాల్సిన పని చాలా ఉందని, తన పనిని కొనసాగిస్తానని చెప్పారు. ఒపీనియన్ పోల్స్‌లో ప్రతికూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తాను పదవి నుంచి దిగిపోతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొట్టిపారేశారు. తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం […]

Share:

తాను ప్రధాని పదవి నుంచి దిగిపోతానంటూ జరుగుతున్న ప్రచారంపై కెనడా పీఎం జస్టిన్ ట్రూడో స్పందించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, తాను చేయాల్సిన పని చాలా ఉందని, తన పనిని కొనసాగిస్తానని చెప్పారు.

ఒపీనియన్ పోల్స్‌లో ప్రతికూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తాను పదవి నుంచి దిగిపోతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొట్టిపారేశారు. తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం విషయంలో ప్రజలు వ్యతిరేకతతో ఉన్నట్లు తనకు తెలుసని అన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ.. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కంటే వెనకబడి ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారాన్ని కోల్పోతుందని పలు పోల్స్ హెచ్చరిస్తున్నాయి. 

నిజానికి అక్టోబర్ 2025 వరకు పాలన సాగించడానికి వీలు కల్పించేలా ‘లెఫ్ట్ ఆఫ్ సెంటర్ న్యూ డెమోక్రాట్ల’తో ట్రూడో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం చివరిదాకా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ముందుగానే కుప్పకూలవచ్చు. ఈ నేపథ్యంలో ఒంటారియోలో రిపోర్టర్లతో జస్టిన్ ట్రూడో మాట్లాడారు. పదవిలో నుంచి దిగిపోతున్నారా? అని ప్రశ్నించగా… ‘‘ఎన్నికలకు వెళ్లడానికి మాకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. నేను నా పనిని కొనసాగిస్తాను” అని బదులిచ్చారు. తనకు చాలా ముఖ్యమైన పని ఉందని, ఆ పని విషయంలో తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు

ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నారంటున్న కన్జర్వేటివ్‌లు

ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నారంటూ జస్టిన్ ట్రూడోపై కన్జర్వేటివ్‌లు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చులు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇళ్లు కొనలేనంతగా ధరలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. మరోవైపు లిబరల్‌ పార్టీలోని కొందరు కూడా ట్రూడోపై విమర్శలు చేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో ప్రతిపక్ష కన్జర్వేటివ్‌లు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రణాళిక ట్రూడో టీమ్‌ వద్ద లేదని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో స్పందించిన ట్రూడో.. ‘‘దేశమంతా గుసగుసలాడుతోంది.. పెరుగుతున్న జీవన వ్యయం ఎన్నో ఇబ్బందులను కలిగిస్తోంది” అని చెప్పారు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి తన తోటి శాసన సభ్యులతో చర్చలు జరుపుతానని ఆయన ప్రకటించారు. 

ట్రూడో ప్రస్థానమిదీ..

1971 డిసెంబర్ 25న ఒట్టావాలో జస్టిన్ పియర్రీ జేమ్స్ ట్రూడో జన్మించారు. 1994లో లిటరేచర్‌‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ, 1998లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ పొందారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చారు. 2013లో లిబరల్ పార్టీ లీడర్‌‌గా ఎన్నికయ్యారు. 2015లో కెనడా ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. కెనడా చరిత్రలో జోయ్ క్లార్క్ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. ఈయన తండ్రి పియర్రీ ట్రూడో కూడా ప్రధాని కావడం గమనార్హం. పియర్రీ ట్రూడో 1968 నుంచి 1979 దాకా, 1980 నుంచి 1984 దాకా ప్రధానిగా ఆయన పని చేశారు. 

భారత్ విషయంలో వివాదాస్పద తీరు

భారత్ విషయంలో జస్టిన్ ట్రూడో తీరు తొలి నుంచి వివాదాస్పదమే. ఖలిస్తాన్ అనుకూల సిక్కు వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్‌ నుంచి ఎక్కువ మంది సిక్కులు కెనడా వెళ్తుండటం, భారీ సంఖ్యలో ఓటర్లు అక్కడ ఉండటమే ఇందుకు కారణం. సిక్కు వేర్పాటువాదులకు స్వర్గధామంగా కెనడా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇటీవల ముగిసిన జీ20 సమిట్‌లోనూ ట్రూడో అంటీముట్టనట్లు వ్యవహరించారు. సదస్సు తొలి రోజైన శనివారం నిర్వహించిన విందుకు హాజరుకాలేదు. కెనడా ప్రధాని కార్యాలయం దీనికి కనీసం కారణం కూడా చెప్పలేదు. ఇక ప్రపంచ నేతలు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు వెళ్లగా..  ట్రూడో ఎవరితోనూ పెద్దగా కలవలేదు. దీంతో ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారు. ట్రూడో చేయిపట్టుకుని, అక్కడి విశేషాలు వివరించేందుకు యత్నించారు. కానీ ట్రూడో సున్నితంగానే చేయి వెనక్కి తీసుకోవడంతో మోదీ కూడా సైలెంట్ అయిపోయారు. ఈ వ్యహారంపై మీడియా ప్రశ్నించగా.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అనుకోవచ్చని ట్రూడో సమధానమిచ్చారు.

ఇక జీ20 చివరి రోజైన ఆదివారం మోదీ–ట్రూడో మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో కెనడా తీరుపై మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందడాన్ని నేరుగా ట్రూడో ఎదుటే ఆయన ప్రస్తావించారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని మోదీ హెచ్చరించారు. దౌత్యవేత్తలపై దాడులు, దౌత్యకార్యాలయాలు, ప్రార్థన స్థలాలపై దాడుల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, నమ్మకం చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు. ట్రూడోతో మోదీ చర్చలపై ప్రధాన కార్యాలయం ప్రకటన రూపంలో విడుదల చేయడం గమనార్హం. మరోవైపు ట్రూడో వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక కారణాలు తలెత్తడంతో మొత్తం ప్రతినిధుల బృందం ఆగిపోవాల్సి వచ్చింది. విమాన సమస్య నేపథ్యంలో ట్రూడో సహా మొత్తం బృందమంతా రెండు మూడు రోజులపాటు ఢిల్లీలో ఉండిపోయింది.