ప‌సికందుల‌ను చంపేసిన న‌ర్సు

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ఏడుగురు ప‌సికందుల‌ను ఓ న‌ర్సు పొట్ట‌న‌బెట్టుకుంది. నర్సులు.. తల్లి తర్వాత తల్లి వంటి వారు. వైద్యం చేయడం డాక్టర్ల వంతు అయితే.. రోగి కోలుకునేలా చేయడంలో నర్సులది కీలక పాత్ర. వారు అందించే సాయం.. చూపే ఓదార్పు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలాంటి వృత్తికి కొందరు పైశాచిక వ్యక్తులు కళంకం తెస్తున్నారు. రోగులతో దారుణాలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. అలా బ్రిటన్‌లో నర్సు ఉన్మాదిలా మారింది. చిన్న పిల్లలను పొట్టనపెట్టుకుంది. నవజాత […]

Share:

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ఏడుగురు ప‌సికందుల‌ను ఓ న‌ర్సు పొట్ట‌న‌బెట్టుకుంది. నర్సులు.. తల్లి తర్వాత తల్లి వంటి వారు. వైద్యం చేయడం డాక్టర్ల వంతు అయితే.. రోగి కోలుకునేలా చేయడంలో నర్సులది కీలక పాత్ర. వారు అందించే సాయం.. చూపే ఓదార్పు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలాంటి వృత్తికి కొందరు పైశాచిక వ్యక్తులు కళంకం తెస్తున్నారు. రోగులతో దారుణాలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. అలా బ్రిటన్‌లో నర్సు ఉన్మాదిలా మారింది. చిన్న పిల్లలను పొట్టనపెట్టుకుంది. నవజాత శిశువులను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి.. ఒకరి తర్వాత ఒకరిని అభం శుభం తెలియని పిల్లలను ఆ న‌ర్సు బలిగొంది. న‌ర్సు వల్ల చనిపోయిన వారిలో ఒకరోజు వయసున్న చిన్నారి కూడా ఉండటం అత్యంత బాధాకరం.

వ్యక్తిగత జీవితంలో అసంతృప్తి..

బ్రిటన్‌లోని చెస్టర్ ఆసుపత్రిలో నర్సుగా 33 ఏళ్ల లూసీ లెట్బీ పని చేస్తోంది. ఆమెకు ఓ వైద్యుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వార్డులోని చిన్నారులకు చికిత్స అందించేందుకు డాక్టర్ వచ్చిన సమయంలో ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ పలుమార్లు ప్రేమ సందేశాలు పంపుకున్నారు. నవజాత శిశువుల వార్డులో పిల్లల ఆరోగ్యం క్షీణించినప్పుడు వారికి చికిత్స అందించేందుకు వచ్చే వచ్చే వైద్యుల్లో ఇతడు కూడా ఉండేవాడు. అలా వచ్చినప్పుడు లూసీతో ఏర్పాడిన పరిచయం ఇద్దరి మధ్య బంధానికి దారితీసింది. డాక్టర్ దృష్టిలో పడేందుకే ఆమె పిల్లలకు హాని కలిగించిందనే అనుమానాలు ఉన్నాయి. 2016లో లూసీని విధుల నుంచి తొలగించిన తర్వాత కూడా వీరిద్దరూ లండన్‌ ట్రిప్‌నకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. 

10 నెలలపాటు విచారణ

లూసీ విషయంలో మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో 10 నెలలపాటు విచారణ జరిగింది. లూసీ చేసిన దుర్మార్గాలకు కారణమేంటనే విషయాలను కోర్టు దృష్టికి దర్యాప్తు ఏజెన్సీ తీసుకెళ్లింది. థ్రిల్, ప్రేమ, నిరాశలో కూరుకుపోవడం, గుర్తింపు కోరుకోవడం, బాధలో ఉండటం వంటి కారణాలతోనే ఆమె ఇలా చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు బ్రిటన్ మీడియా చెప్పుకొచ్చింది. వార్డులో పిల్లకు తానే హాని చేసి.. తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని ఆమెనే అలర్ట్ చేసేదట. అక్కడి పరిస్థితిని చూసి ఆమె ఎంజాయ్ చేసేదని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం వంటివి లూసీ చేసింది. అప్పుడు చిన్నారుల తల్లిదండ్రులు పడే వేదన నుంచి థ్రిల్ పొందేందుకు. ఇలా ఏడుగురు చనిపోగా, మరో ఆరుగురు లూసీ బారిన పడినా.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 

నేను చెడ్డ దాన్ని

దర్యాప్తు సందర్భంగా లూసీ ఇంట్లో కొన్ని కాగితాలను పోలీసులు గుర్తించారు. వాటిలో ‘‘నేను చెడ్డదాన్ని.. వారిని ఉద్దేశపూర్వకంగా చంపాను. ఎందుకంటే నేను వారిని చూసుకునేంత మంచి దాన్ని కాదు..’’ అని లూసీ రాసుకొచ్చింది. ‘‘నాకు ఎప్పటికీ పెళ్లి కాదు.. పిల్లలు పుట్టరు. కుటుంబం ఉంటే వచ్చే భావన కూడా నాకు తెలియదు” అని మరో లేఖలో ఉంది. వీటన్నింటినీ పరిశీలించాక.. నిరాశ, మానసిక వేదనతోనే లూసీ ఈ దారుణాలకు పాల్పడి ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. 

అప్పుడే గుర్తించి ఉంటే పిల్లలు బతికేవారు

లూసీ లెట్బీ చేసిన దారుణాన్ని భారత సంతతి డాక్టర్ రవి జయరాం సహా ఇతర వైద్యులు బయటపెట్టారు. వారు చేసిన ఫిర్యాదుతోనే ఈ అమానుష ఘటన బయటపడింది. లూసీ పని చేసిన ఆసుపత్రిలోనే జయరాం పని చేసేవారు. పిల్లల వైద్యుడిగా ఆయన సేవలందిస్తున్నారు. మీడియాతో జయరాం మాట్లాడుతూ.. “2015 జూన్‌లో ముగ్గురు పసికందులు చనిపోయారు. ఒకరోజు రాత్రి నేను నవజాత శిశువుల వార్డు ముందు నుంచి వెళ్తుండగా.. ఇంక్యుబేటర్ పక్కన నిల్చుని లూసీ కనిపించింది. అక్కడ ఏదో తేడాగా అనిపించింది. అప్పుడే లూసీపై అనుమానం కలిగింది. ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్స్‌కు ఆమె గురించి చెప్పాం. కానీ వాళ్లు నమ్మలేదు. సహోద్యోగిపై అనవసర ఆరోపణలు చేయొద్దని మమ్మల్నే అన్నారు. లూసీకి క్షమాపణలు చెప్పాలని అడిగారు” అని వివరించారు. దీంతో ఆమెకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని నాటి సంగతులను జయరాం గుర్తు చేసుకున్నారు. అప్పుడే తమ ఆందోళనను తీవ్రంగా పరిగణించి ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదని, కనీసం నలుగురు లేదా ఐదుగురు బతికి ఉండేవారని వాపోయారు. 2017లో మరోసారి ఫిర్యాదు చేశామని, తర్వాత దర్యాప్తు ప్రారంభించి అధికారులు అరెస్టు చేశారని వివరించారు. 2018లో లూసీని అరెస్టు చేయగా.. 2020లో ఆమెపై అభియోగాలు మోపారు. తాజాగా ఆమెను దోషిగా తేల్చారు.