ఇండియాకు రుణపడి ఉన్నాం, టూరిజం మాల్దీవులకు జీవనాధారం: MATATO లేఖ

MATATO: "టూరిజం మాల్దీవులకు జీవనాధారం. దయచేసి మాల్దీవులకు విమాన బుకింగ్ లను పునరుద్దరించండి" అని ఓ ప్రకటనలో MATATO అభ్యర్థన చేసింది.

Courtesy: Top Indian News

Share:

ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతర పరిణామాలతో భారత్, మాల్దీవుల మధ్య విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌(EaseMyTrip).. మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను కూడా నిలిపివేసింది. దీనిపై అక్కడి టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్ల సంఘం(MATATO) స్పందించింది. "టూరిజం మాల్దీవులకు జీవనాధారం. దయచేసి మాల్దీవులకు విమాన బుకింగ్ లను పునరుద్దరించండి" అని ఓ ప్రకటనలో MATATO అభ్యర్థన చేసింది.

MATATO రాసిన లేఖను EaseMyTrip వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి ట్విటర్ లో షేర్ చేశారు. తమ నేతలు కొందరు చేసిన విచారకరమైన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఈజ్‌మైట్రిప్‌ను కోరింది. ఆ మాటలు మాల్దీవుల ప్రజల అభిప్రాయం కాదని వెల్లడించింది. ఈజ్‌మైట్రిప్(EaseMyTrip) తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, తమ దేశానికి విమాన బుకింగ్‌లను తెరవాలని మటాటో లేఖ రాసింది.  రెండు దేశాల మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని, భారతీయులను సొంతవారిగా భావిస్తామని వెల్లడించింది. తమ పర్యాటక రంగంలో భారతీయులు అత్యంత కీలకమని వెల్లడించింది. 

“పర్యాటక రంగం మాల్దీవులకు జీవనాధారం, మన GDPలో మూడింట రెండు వంతులకు పైగా దోహదపడుతోంది. పర్యాటక రంగంలో ప్రత్యక్షంగా పనిచేస్తున్న సుమారు 44,000 మంది మాల్దీవులకు జీవనోపాధిని అందిస్తోంది. టూరిజంపై  ప్రతికూల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది, ఇది చాలా మంది జీవితాలను మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. భారత్‌ మాకు స్థిరమైన, కీలక పర్యాటక వనరు. కొవిడ్‌ తర్వాత మేం కోలుకోవడానికి ఆ దేశం ఎంతో సాయం చేసింది. అంతేకాదు.. మా దేశానికి అతి సన్నిహితమైన దేశం భారత్‌. ప్రతి సంక్షోభంలోనూ ఆ దేశమే తొలిసారిగా స్పందిస్తుంది. అందుకు మేం భారత్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం ”అని యూనియన్ లేఖలో పేర్కొంది.

మరోవైపు చైనాలో మొయిజ్జు కీలక వ్యాఖ్యలు
మాల్దీవులు డ్రాగన్ దేశం చైనాపై  ఆశలు పెంచుకుంటోంది. తమ దేశానికి టూరిస్టుల సంఖ్యను పెంచేందుకు చైనాపై ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు తమ దేశానికి చైనా నుంచి భారీగా టూరిస్టులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడి వాణిజ్యవేత్తలను ప్రత్యక్షంగా కోరారు. 

వివాదం ఎక్కడ మొదలైంది?
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు. తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, పలు విమానయాన సంస్థలు మాల్దీవులకు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించాయి. భారతీయులు పూర్తిగా మాల్దీవులను రద్దు చేసుకుంటే జరగబోయే ప్రమాదాన్ని అర్థం చేసుకున్న మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసింది మాల్దీవులు ప్రభుత్వం.