కుక్కలా కనిపించేందుకు రూ.16 లక్షలు ఖర్చు చేసిన జపాన్ వాసి!

జపాన్‌లోని ఓ పార్కు.. ఓ యువతి కుక్కను తీసుకుని వచ్చి వాకింగ్ చేస్తోంది.. అటు వైపు వెళ్తున్న వాళ్లందరి చూపు ఆ కుక్కపైనే. ఏదో తెలియని ఆకర్షణ, తీర్చిదిద్దినట్లుగా ఉన్న రూపం! కుక్కలైతే మరింత ఆసక్తిగా చూస్తున్నాయి. కొన్నేమో మోరుగుతున్నాయి.. ఇంకొన్ని బిత్తరపోతున్నాయి.. ఎందుకు? ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ అన్నారు పెద్దలు.. అందంగా కనిపించడానికి సర్జరీలు చేయించుకునే వాళ్లు కొందరైతే.. ఫిట్‌గా ఉండటానికి నానా అవస్థలు పడేవాళ్లు ఎందరో.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కాస్త […]

Share:

జపాన్‌లోని ఓ పార్కు.. ఓ యువతి కుక్కను తీసుకుని వచ్చి వాకింగ్ చేస్తోంది.. అటు వైపు వెళ్తున్న వాళ్లందరి చూపు ఆ కుక్కపైనే. ఏదో తెలియని ఆకర్షణ, తీర్చిదిద్దినట్లుగా ఉన్న రూపం! కుక్కలైతే మరింత ఆసక్తిగా చూస్తున్నాయి. కొన్నేమో మోరుగుతున్నాయి.. ఇంకొన్ని బిత్తరపోతున్నాయి.. ఎందుకు?

‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ అన్నారు పెద్దలు.. అందంగా కనిపించడానికి సర్జరీలు చేయించుకునే వాళ్లు కొందరైతే.. ఫిట్‌గా ఉండటానికి నానా అవస్థలు పడేవాళ్లు ఎందరో.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కాస్త తేడా! తనను తాను కుక్కలా చూసుకోవాలని అనుకున్నాడు!! ఇందుకోసం ఓ క్యాస్ట్యూమ్ కూడా డిజైన్ చేయించుకున్నాడు. పదో పరకో కాదు.. ఏకంగా రూ.16 లక్షలకుపైనే ఖర్చు చేశాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.

 

కాస్ట్యూమ్‌ కోసం 40 రోజులు

జపాన్‌లో టోకో అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి కుక్కలంటే చాలా ఇష్టమట. ఎంత ఇష్టమంటే.. ఏకంగా తనను తాను కుక్కలా చూసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ‘జెప్పెట్‌’ అనే కంపెనీని ఆశ్రయించాడు. ఆ సంస్థ నుంచి డాగ్ కాస్ట్యూమ్‌ను  కొనుగోలు చేశాడు. అయితే అనుకున్నంత ఈజీగా ఇదంతా జరగలేదు. ఈ క్లిష్టమైన కుక్క ముసుగును రూపొందించేందుకు దాదాపు 40 రోజులకు పైనే పట్టిందట. ఇలా తనను తాను మార్చుకునేందుకు ఏకంగా 20 వేల అమెరికన్ డాలర్లను ఖర్చు చేశాడు. ఇది మన రూపాయల్లో చూసుకుంటే 16 లక్షలకు పైనే.

ఎవరైనా చెప్తే తప్ప గుర్తుపట్టలేం

ఎట్టకేలకు తయారైన కాస్ట్యూమ్‌ను ధరించేందుకు టోకో పాట్లు పడ్డాడు. కుక్కలా ఉండేందుకు, నడిచేందుకు, పడుకునేందుకు ప్రాక్టీస్ చేశాడు. తర్వాత ఒకానొక రోజున తొలిసారి జపాన్‌ వీధుల్లోకి వచ్చేశాడు టోకో. వెంటనే చూస్తే ఎవరైనా కుక్క అనుకోవాల్సిందే. అలా ఆ ఉంది ఆ వేషం. నడక.. కూర్చునే తీరు.. ముఖం.. ఆకర్షణీయమైన జుట్టు.. అన్నీ అచ్చు గుద్దినట్లు శునకం మాదిరే. ‘కుక్క కాదు.. వేషం’ అని ఎవరైనా చెబితే తప్ప కనుక్కోలేనంతగా ఉంది ఆ రూపం. ఇంకేముంది ఆశ్చర్యపోవడం జనం వంతు అయింది. చూసిన వాళ్లందరూ ‘వావ్’ అనకుండా ఉండలేకపోయారు.

అయితే పార్క్‌లో ఈ ‘కుక్క’ను చూసిన మిగతా కుక్కలు మాత్రం భయపడిపోయాయి. కొన్ని దూరంగా పరిగెత్తాయి. మరికొన్ని కరవడానికి వచ్చాయి. ఇంకెన్ని ఆసక్తిగా చూస్తూ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించాయి. ఇది కాస్తా నెట్టింట వైరల్ అయింది. కుక్క రూపంలో ఉన్న టోకో సెన్షేషన్ అయిపోయాడు. అతడి వీడియో ప్రస్తుతం ట్విట్టర్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఎన్నాళ్లు ఇలా?

జంతువుల పట్ల తనకున్న అభిమానాన్ని, కుక్కలా మారాలన్న ఆకాంక్షను టెక్నాలజీ సాయంతో ఇలా నెరవేర్చుకున్నాడు టోకో. ఇదేం పైత్యం అని కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు ఇదెక్కడి విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే టోకో ఇలా  ఎన్నాళ్లు ఉంటాడు? పూర్తిగా ఇలానే ఉండాలని అనుకుంటున్నాడా? లేదా కేవలం ఇష్టంతో వేషం తయారు చేయించుకున్నాడా? అసలు కుక్క వేషంలో ఎక్కువ రోజులు ఉండటం సాధ్యమేనా? వెయింట్ అండ్ సీ!!