కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకి తగ్గుతున్న జనాధారణ..

ఖలిస్తానీ నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు.. ఆ దేశంలో జనాదరణ గణనీయంగా పడిపోయింది. గత యాభైళ్లలో కెనడాలో ఎన్నికైన అత్యంత చెత్త ప్రధాని ట్రూడోనేనని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ట్రూడో రోజురోజుకు కెనడా ప్రజల మద్దతును కోల్పోతున్నారని, ఆయన నాయకత్వ పటిమపై కెనడా ఓటర్లకు విశ్వాసం సన్నగిల్లిందని కెనడాకు చెందిన గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన పోల్‌ సర్వేలో తేలింది. […]

Share:

ఖలిస్తానీ నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు.. ఆ దేశంలో జనాదరణ గణనీయంగా పడిపోయింది. గత యాభైళ్లలో కెనడాలో ఎన్నికైన అత్యంత చెత్త ప్రధాని ట్రూడోనేనని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ట్రూడో రోజురోజుకు కెనడా ప్రజల మద్దతును కోల్పోతున్నారని, ఆయన నాయకత్వ పటిమపై కెనడా ఓటర్లకు విశ్వాసం సన్నగిల్లిందని కెనడాకు చెందిన గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన పోల్‌ సర్వేలో తేలింది.

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోపై ఆ దేశ ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేక పెరుగుతోంది. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌పై అసత్య ఆరోపణలు చేసిన ట్రూడోకు కెనడాలో జనాదరణ గణనీయంగా పడిపోయింది. దాదాపు 60 శాతం మంది ప్రజలు ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు ఈ పోల్స్‌లో తేలింది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ట్రూడోకు ఉన్న పాపులారిటీ పడిపోయిందని, ఇదే సమయంలో ప్రధాని అభ్యర్థి రేసులో ప్రతిపక్షనేత పొయిలివ్రేకు పాపులారిటీ పెరుగుతోందని కెనడాకు చెందిన గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన పోల్స్‌ సర్వే పేర్కొంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేత పియరీ పొయిలివ్రే వైపు దాదాపు 40శాతం మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది.

ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ 30 శాతం ఓట్లకే పరిమితం కానుంది. ప్రస్తుతం ట్రూడో నాయకత్వంలో కెనడా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు అక్కడి ఆరోగ్య, గృహరంగాల సమస్యల పరిష్కారంలో కూడా ట్రూడో సర్కారు విఫలమైందని సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. ఈ మూడు రంగాల్లో ప్రతిపక్ష నేత పియరీ వద్ద మెరుగైన ప్రణాళికలు ఉన్నట్లు పోల్స్‌లో పాల్గొన్నవారు చెబుతున్నారు. జులైలో నిర్వహించిన మరో సర్వేలో గత 50 ఏళ్లలో కెనడా చూసిన అత్యంత చెత్త ప్రధానమంత్రి ట్రూడోనేనని తేలడం గమనార్హం.

2025లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పొయిలివ్రేకు చెందిన కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు…సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగినా పొయిలివ్రేకు 39 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే పొయిలివ్రే పాపులారిటీ 5 శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. మరోవైపు జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వానికి ప్రస్తుతం మద్దతు ఇస్తున్న ఎన్డీపీ నేత జగ్మీత్‌ సింగ్‌ పాపులారిటీ కూడా నాలుగు శాతం పతనమైంది. ప్రస్తుతం ఆయనకు మద్దతు 26 శాతం నుంచి 22శాతానికి తగ్గినట్లు సర్వేలు చెబుతున్నాయి.

నాడు తండ్రి.. నేడు కుమారుడు..  

ప్రస్తుత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలతో భారత్‌, కెనడా మధ్య సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి.  భారత్​-కెనడా మధ్య వైరాన్ని మరింత పెంచుతున్నాయి. అంతకుముందు జస్టిన్​ ట్రూడో తండ్రి పిరె ఇలియట్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఇలాంటి వైఖరినే ప్రదర్శించారు. మరి తండ్రీకొడుకులు భారత్ పట్ల ఏందుకు ఇలాంటి వైఖరిని అవలంభిస్తున్నారో? ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఎందుకు అండగా నిలుస్తున్నారో తెలియడం లేదు.  జస్టిన్ ట్రూడో తండ్రి పిరె ఇలియట్‌ ట్రూడో కూడా భారత్‌ పట్ల ఇలాంటి ఘర్షణ వైఖరినే ప్రదర్శించారు. ప్రధాని హోదాలో ఆయన కూడా ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు ఊతమిచ్చారు. 300 మందికిపైగా భారతీయ ప్రయాణికులతో కూడిన విమానాన్ని గాల్లోనే ఉగ్రవాదులు పేల్చడానికి పరోక్షంగా కారణమయ్యారు.

1985 జూన్‌ 23న కెనడాలోని టొరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం ‘కనిష్క’ను ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు సూట్‌కేసు బాంబులతో గాల్లోనే పేల్చేశారు. కెనడాలో తలదాచుకున్న ఖలిస్థాన్‌ ఉగ్రవాది, బబ్బర్‌ ఖల్సా సభ్యుడు తల్వీందర్‌ సింగ్‌ పర్మార్‌ దీనికి ప్రధాన సూత్రధారి. అతడిని అప్పగించాలన్న భారత్​ అభ్యర్థనను అప్పటి కెనడా ప్రధాని పిరె ట్రూడో తోసిపుచ్చారు. నిజానికి కనిష్క పేలుడుకు కారణమైన పర్మార్‌ సహా ఇతరులనూ కెనడా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఒక్కరికి (ఇందర్‌జిత్‌ సింగ్‌) మాత్రమే 15 ఏళ్ల జైలుశిక్ష విధించి.. మిగతావారిని విడిచిపెట్టింది. ఉగ్రవాదులు విమాన దాడులకు పాల్పడే అవకాశం ఉందని 20 రోజుల ముందే భారత నిఘా వర్గాలు కెనడాకు సూచించాయి. సరైన భద్రత చర్యలు తీసుకోవాలని కోరాయి. పిరె ప్రభుత్వం వాటన్నింటినీ పెడచెవినపెట్టింది.