Joe Biden: గాజా ఆక్రమణపై ఇజ్రాయేల్‌కు అమెరికా వార్నింగ్

హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు గతవారం చేపట్టిన ఇజ్రాయేల్ ఆపరేషన్ (Israel Operation) కీలక దశకు చేరుకుంది. సైనిక చర్యలో భాగంగా గాజా(Gaza) నగరాన్ని ఇజ్రాయేల్ దళాలు(Israeli forces) చుట్టుమట్టాయి. తక్షణమే నగరాన్ని వదిలి వెళ్లాలన్న ఇజ్రాయేల్ హెచ్చరికలతో ఉత్తర ప్రాంతంలోని పది లక్షల మందికిపైగా ప్రజలు తమ ఇళ్ల నుంచి వెళ్లగొట్టబడ్డారని ఐరాస వెల్లడించింది. భూతల దాడికి సిద్ధమవుతోన్న ఇజ్రాయేల్ సైన్యం(Israel army).. గాజా శివారుల్లో యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, రిజర్వ్ బలగాలను మోహరించింది. గాజా […]

Share:

హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు గతవారం చేపట్టిన ఇజ్రాయేల్ ఆపరేషన్ (Israel Operation) కీలక దశకు చేరుకుంది. సైనిక చర్యలో భాగంగా గాజా(Gaza) నగరాన్ని ఇజ్రాయేల్ దళాలు(Israeli forces) చుట్టుమట్టాయి. తక్షణమే నగరాన్ని వదిలి వెళ్లాలన్న ఇజ్రాయేల్ హెచ్చరికలతో ఉత్తర ప్రాంతంలోని పది లక్షల మందికిపైగా ప్రజలు తమ ఇళ్ల నుంచి వెళ్లగొట్టబడ్డారని ఐరాస వెల్లడించింది. భూతల దాడికి సిద్ధమవుతోన్న ఇజ్రాయేల్ సైన్యం(Israel army).. గాజా శివారుల్లో యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, రిజర్వ్ బలగాలను మోహరించింది.

గాజా నగరంపై భూతల దాడికి సిద్దమవుతున్న వేళ ఇజ్రాయెల్‌(Israel)కు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలు చేసింది. గాజాను ఆక్రమించుకోవద్దని, అది చాలా పెద్ద తప్పిందమవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) హెచ్చరించారు. అక్టోబరు 6న హమాస్(Hamas) జరిపిన మెరుపు దాడుల్లో 29 మంది అమెరికన్లు సహా 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ.. గాజా స్ట్రిప్‌ను పూర్తిస్థాయిలో ఆక్రమించుకోవడాన్ని తాము సమర్థించబోమని స్పష్టం చేశారు.

‘‘అది చాలా పెద్ద తప్పే అవుతుంది’’ అని అమెరికా అధ్యక్షుడు ఉద్ఘాటించారు. గాజాలో ఏం జరుగుతోందో తన కోణంలో చెప్పాలంటే.. అక్కడి పాలస్తీనా(Palestine) ప్రజలందరికీ హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రాతినిధ్యం వహించబోదని బైడెన్ తేల్చి చెప్పారు. కాబట్టి గాజాను ఇజ్రాయేల్ మళ్లీ ఆక్రమించుకుంటే అదిపెద్ద తప్పే అవుతుందని స్పష్టం చేశారు. అయితే, ఇదే సమయంలో అక్కడున్న ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందేనని బైడెన్(Joe Biden) పునరుద్ఘాటించారు. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ ముందుకు వెళ్లదన్న విశ్వాసం తనకు ఉందని బైడెన్ పేర్కొన్నారు.

తన బృందం గాజా నివాసితులకు సేఫ్ జోన్‌(Safe Zone)లోకి తరలించేందుకు చర్చిస్తోందని.. మహిళలు, పిల్లలను సంఘర్షణ ప్రాంతం నుంచి బయటకు తీసుకురావడంలో సహాయం గురించి ఈజిప్టు(Egypt) ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు బైడెన్ చెప్పారు. ‘అమాయక పౌరుల హత్యలను నివారించడానికి ఇజ్రాయేల్‌‌ తమ శక్తి మేరకు ప్రతిదీ చేయబోతుందని బిడెన్ చెప్పారు.

ఇజ్రాయెల్‌కు వెళ్లాలా? వద్దా?

ఇదిలా ఉండగా, గాజా ఆక్రమణపై ఇజ్రాయేల్‌(Israel)కు మద్దతు విషయంలో అమెరికా(America) ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రాంతీయ సంక్షోభం(Crisis) తీవ్రతరం అవుతుందనే భయంతో మద్దతును సమతుల్యం చేయడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో ఇజ్రాయేల్‌(Israel) పర్యటనకు వెళ్లే విషయంలో బైడెన్(Joe Biden) ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంతర్గత చర్చల గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తుల ప్రకారం.. ఇజ్రాయెల్‌కు వెళ్లాలా? వద్దా? అనే దానిపై జో బైడెన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

అలాగే, పర్యటనపై వైట్‌హౌస్‌(White House) ఎటువంటి ప్రకటన చేయలేదని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి చెప్పారు. గాజా(Gaza)లోని పాలస్తీనియన్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని అరబ్ నాయకులు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని.. సంక్షోభం మరింత పెరగకుండా అమెరికా(America) ప్రయత్నిస్తోందనడానికి ఇది సంకేతం.

భూతల దాడికి సిద్ధమైన ఇజ్రాయేల్ దళాలు.. గాజా పౌరులకు ఇచ్చిన గడువు ముగియడంతో వారంతా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని నగరాన్ని వీడుతున్నారు. ఉత్తర ప్రాంతం నుంచి పది లక్షల మందికిపైగా ప్రజలు గాజా నుంచి తరలిపోయినట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ భారీ వలస మానవతా సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక లెక్కల ప్రకారం..ఇప్పటి వరకు గాజా పట్టణం నుంచి 4 లక్షల మంది వలస వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు 10 వేల మంది ప్రజలు గాజాలో దక్షిణం వైపునకు వెళ్లిపోయారు. ప్రజలు దక్షిణ గాజా వైపునకు వలస వెళ్లిపోతున్నారని తెలుసుకున్న  యుద్ధవిమానాలు..వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఈ  దాడుల్లో 70 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై మధ్య ప్రాచీన దేశాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. జోర్దాన్, బహ్రెయిన్లలో వేలాది మంది గాజా ప్రజలకు సంఘీభావం తెలిపారు.