జపాన్ లో విమాన ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు

Japan Airlines Accident: జపాన్‌ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్‌ 516 విమానం ప్రమాదానికి గురైంది. రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్‌ వేపై దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది.

Courtesy: x

Share:

టోక్యో: జపాన్‌ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్‌ 516 విమానం ప్రమాదానికి గురైంది. రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్‌ వేపై దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. ఇది హొక్కైడో విమనాశ్రయం నుంచి  బయల్దేరి వచ్చింది. విమానం రన్‌వేపై దిగిన తర్వాత అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొన్నట్లు అధికారులు భావిస్తున్నారు. విమానం ఆగిన త‌ర్వాత కొంద‌రు ప్ర‌యాణికులు ఆ మంట‌ల నుంచి త‌ప్పించుకుంటూ ప‌రుగులు తీశారు. ఆ దృశ్యాలు కూడా రిలీజ్ అయ్యాయి. ప్ర‌స్తుతం జ‌పాన్ విమానాశ్ర‌యంలో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 

ఈ ఘటనపై జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధికారులు స్పందిస్తూ.. విమానం రన్‌వేపై దిగిన తర్వాత అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొన్నట్లు భావిస్తున్నామని జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కేకు తెలియజేశారు. ఇప్పటికీ విమానం మంటలు అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్‌ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది వరకు ఉన్నారని ఎన్‌హెచ్‌కే పేర్కొన్నట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. వీరందరినీ బయటకు చేర్చినట్లు తెలిపింది. ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియరాలేదు. 

సోమ‌వార‌మే భారీ భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. 7.6 తీవ్ర‌త‌తో వ‌చ్చిన భూకంపం వల్ల పెను న‌ష్టం జ‌రిగింది. అనేక ప్ర‌దేశాల్లో రోడ్లు, మెట్రో స్టేష‌న్లు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య 48కి దాటింది. అయితే ఇవాళ విమాన ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం జ‌రిగిందా లేదా అన్న అంశంపై ఇంకా స్ప‌ష్టత లేదు. కొన్ని ఏజెన్సీలు మాత్రం ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదని వార్తల‌ను ప్ర‌చురిస్తున్నాయి.