భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్..

భారతీయ వైద్య విద్యార్థులు ఇక మీదట పలు విదేశాలలో కూడా ప్రాక్టీస్‌ చేయొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. మన దేశంలో వైద్య విద్య అభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పీజీ కోర్సుల్లో చేరవచ్చని అలాగే ఆ దేశాల్లో ప్రాక్టీస్‌ కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి జాతీయ వైద్య మండలికి 10 ఏళ్ల కాల పరిమితికి గుర్తింపు లభించినట్లు […]

Share:

భారతీయ వైద్య విద్యార్థులు ఇక మీదట పలు విదేశాలలో కూడా ప్రాక్టీస్‌ చేయొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. మన దేశంలో వైద్య విద్య అభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పీజీ కోర్సుల్లో చేరవచ్చని అలాగే ఆ దేశాల్లో ప్రాక్టీస్‌ కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి జాతీయ వైద్య మండలికి 10 ఏళ్ల కాల పరిమితికి గుర్తింపు లభించినట్లు ప్రకటనలో వెల్లడించింది. 2024 సంవత్సరం నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్‌ కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపింది.

ఈ అక్రిడిటేషన్‌ కింద ప్రస్తుతం దేశంలో ఉన్న 706 వైద్య కళాశాలలు వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు పొందాయని, రాబోయే పదేళ్లలో ఏర్పాటు చేయబోయే కొత్త వైద్య కళాశాలలకు కూడా ఈ గుర్తింపు వర్తిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో వెల్లడించింది. భారతదేశ అంతర్జాతీయ ప్రమాణాల నేపథ్యంలో విదేశీ విద్యార్థులకు ఆకర్షణీయమైన డెస్టినేషన్‌ అవుతుందని, దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ గుర్తింపు పెరుగుతుందని పేర్కొంది. 

భారతీయ వైద్య నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు, ఖ్యాతి లభిస్తుందని, వైద్య విద్యలో నిరంతర అభివృద్ధి, ఆవిష్కరణలకు ఈ గుర్తింపు సహకరిస్తుందని తెలిపింది. భారతీయ వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా ఇక తమ కెరీర్‌ను కొనసాగించవచ్చని, విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తారని జాతీయ వైద్య మండలి ప్రతినిధి తెలిపారు. వైద్య విద్యా సంస్థల నాణ్యత పట్ల, ఇక్కడి అధ్యాపకుల పట్ల నమ్మకం పెరుగుతుందని అన్నారు.

వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికి అంకితమైన ప్రపంచ సంస్థ. WFME యొక్క లక్ష్యం మొత్తం మానవాళికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం ప్రయత్నించడం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ప్రకారం, వైద్య విద్యలో అత్యున్నత శాస్త్రీయ మరియు నైతిక ప్రమాణాల ప్రచారంతో ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య నాణ్యతను మెరుగుపరచడం వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు కోసం ఆ సంస్థ ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్ల  (₹ 4,98,5142) రుసుమును వసూలు చేస్తోంది. ఈ ప్రకారం వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు కోసం దేశంలోని 706 వైద్య కళాశాలలు మొత్తంగా దాదాపు 4,23,60,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.  

ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇంటర్నేషనల్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు లైసెన్స్‌లు ఇచ్చే పాలసీలు, నిబంధనలను అమెరికాలోని ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆన్‌ ఫారిన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(ECFMG)  పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఇంటర్నేషనల్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌లు యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌లను రాయడానికి, రెసిడెన్సీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆన్‌ ఫారిన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ధృవీకరించి ఉండాలి అని పేర్కొంది. ECFMG 2010 లోనే కొత్త నిబంధనలను రూపొందించింది. అవి 2023 నుంచి వర్తించాల్సి ఉండగా కరోనా కారణంగా ఆ నిబంధనలను 2024 నుంచి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం 2024 నుంచి  ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆన్‌ ఫారిన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు తగిన గుర్తింపు పొందిన వైద్య విద్యా సంస్థల నుంచి గ్రాడ్యుయేట్‌ అయ్యి ఉండాలి.