చైనాను దాటేసిన భారత్ జనాభా 142.86 కోట్లు

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ప్రపంచ జనాభా 804.5 కోట్లుగా ఉండగా.. అందులో మూడింట ఒక వంతు జనాభా ఇండియా, చైనాలోనే ఉన్నారనిఐక్యరాజ్యసమితి తాజాగా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని సుమారు 200 దేశాల్లో 804.5 […]

Share:

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ప్రపంచ జనాభా 804.5 కోట్లుగా ఉండగా.. అందులో మూడింట ఒక వంతు జనాభా ఇండియా, చైనాలోనే ఉన్నారనిఐక్యరాజ్యసమితి తాజాగా నివేదిక వెల్లడించింది.

ప్రపంచంలోని సుమారు 200 దేశాల్లో 804.5 కోట్ల మంది నివసిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ తెలిపింది. 142.86 కోట్ల జనాభాతో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నట్టు తెలిపింది. ఇండియా కంటే సుమారు 29 లక్షల తక్కువ జనాభాతో చైనా (142.57 కోట్లు) రెండో స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు-2023’ పేరిట బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపారు.1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలు పెట్టాక ప్రపంచ జనాభా జాబితాలో ఇండియా తొలిసారిగా ప్రథమ స్థానంలోకి రావడం విశేషం.

ప్రపంచంలోని మొత్తం జనాభాలో మూడింట వంతులలో  1వంతు జనాభా కేవలం భారత్‌, చైనాలోనే ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి నివేదికలో అంచనా వేసి వెల్లడించింది.   గడిచిన కొన్నాళ్లుగా చైనాలో జనాభా పెరుగుదల తగ్గుతుండగా.. ఇండియాలో పెరుగుతూ వచ్చింది.  గత ఏడాదిలో ఇండియాలో జనాభాలో 1.56 శాతం పెరుగుదల నమోదైనట్టు లెక్క వేశారు. భారత్‌లోని మొత్తం జనాభాలో 68 శాతం 15- 64 ఏళ్ల మధ్య వయసు వారేనని నివేదికలో తెలిపారు. 15- 24 మధ్య వయసు  యువత జనాభా 21.5 కోట్లని వెల్లడించింది. సంతానోత్పత్తి రేటు సగటున 2గా ఉన్నట్టు తెలిపింది. ప్రజల సగటు ఆయుర్దాయం పురుషులకు 71 ఏళ్లుగా, మహిళలకు 74 ఏళ్లుగా తెలిపింది.

భారత్ ఈ నివేదికలో మొదటి స్థానంలో ఉండడంతో చైనా విమర్శలు గుప్పించింది.  ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జనాభా వల్ల కలిగే ప్రయోజనాలు క్వాంటిటీ మీద ఆధారపడవు. క్వాలిటీ మీద ఆధారపడి ఉంటాయి’ అని అన్నారు. ‘చైనా జనాభా 140 కోట్ల పైమాటే. ఇందులో శ్రామిక శక్తి చేసే వారి సంఖ్య సుమారు 90 కోట్లు. మా జనాభా అదృశ్యమైపోలేదు. అది వృద్ధి చెందుతూ అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తున్నది’ అని వెన్‌బిన్‌ అన్నారు.

2050 నాటికి జనాభాపరంగా మొదటి 10 స్థానాల్లో ఉండే దేశాలు ఇవి అని అంచనా. 

భారత్‌, చైనా, నైజీరియా, అమెరికా, పాక్‌, ఇండోనేషియా, బ్రెజిల్‌, ఇథియోపియా, కాంగో, బంగ్లాదేశ్‌. 

ఇండియాలో జనాభా వేగంగా పెరగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలింది. యుఎన్ఎఫ్టిఏ భారత ప్రతినిధి ఆండ్రియా ఓజో నార్ అన్నారు. జనాభా పెరుగుదల అనేది ఆందోళన అంశంగా చూసే బదులు పురోగతి, అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు.