మేకిన్ ఇండియాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సరైన విధంగానే ముందుకు వెళ్తున్నారని పుతిన్ చెప్పారు. 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోదీ సరైన విధంగానే ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. వ్లాదివోస్తోక్‌లో జరిగిన 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడిన పుతిన్.. రష్యా […]

Share:

‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సరైన విధంగానే ముందుకు వెళ్తున్నారని పుతిన్ చెప్పారు. 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోదీ సరైన విధంగానే ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. వ్లాదివోస్తోక్‌లో జరిగిన 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడిన పుతిన్.. రష్యా తయారీ కార్ల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. ‘‘మనకు గతంలో దేశీయంగా తయారైన కార్లు లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయి. మనం 1990ల్లో భారీ స్థాయిలో కొనుగోలు చేసిన మెర్సెడెజ్, ఆడీ కంపెనీ కార్లతో పోల్చుకుంటే ఇవి మెరుగైనవే. స్వదేశీ తయారీ విషయంలో మన భాగస్వామ్య దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలను మనం పరిశీలించాలి. ఉదాహరణకు భారతదేశం.. అక్కడ స్వదేశీ తయారీ, వినియోగంపై దృష్టిపెడుతున్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోదీ నాయకత్వంలోని భారత్ సరైన రీతిలోనే ముందుకు సాగుతోంది” అని పుతిన్ చెప్పారు.

రష్యాలో తయారైన ఆటోమొబైల్స్‌ను ఉపయోగించాలి

రష్యాలో తయారైన ఆటోమొబైల్స్‌ను ఉపయోగించడం కచ్చితంగా మంచిదని వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ‘‘మన దగ్గర రష్యన్ మేడ్ ఆటోమొబైల్స్ ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించాలి. ఇది కచ్చితంగా మంచిది. ఎందుకంటే ఇది డబ్ల్యూటీవో (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) ఆబ్లిగేషన్ల ఉల్లంఘనలకు దారి తీయదు. ఇది మన దేశంలో కొనుగోళ్లకు సంబంధించినది. మనం ఈ మేరకు నిర్దిష్ట గొలుసును సృష్టించాలి. తద్వారా దేశీయంగా తయారైన కార్లను వివిధ హోదాల్లోని అధికారులు ఉపయోగిస్తారు” అని ఆయన వివరించారు. 

ఎకనమిక్‌ కారిడార్‌‌తో మనకు లాభమే

ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనమిక్ కారిడార్‌‌ (ఐఎంఈసీ)ను జీ20 సమిట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. చైనా వన్‌ బెల్డ్ – వన్ రోడ్‌ ప్రాజెక్టుకు చెక్ పెట్టేలా దీనికి శ్రీకారం చుట్టారు. జీ20 సమిట్ సైడ్‌లైన్స్‌లో భాగంగా గత శనివారం జరిగిన భేటీలో అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు ఐఎంఈసీని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఐఎంఈసీపై స్పందించిన పుతిన్.. ఈ ప్రాజెక్టు వల్ల రష్యాపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. పైగా తమ దేశానికే ప్రయోజనకరమని చెప్పారు. ఐఎంఈసీ ఇనిషియేటివ్.. రష్యా, చైనా ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తుందా? రష్యా అభిప్రాయమేంటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇది మన మంచికేనని నేను భావిస్తున్నా. ఇది లాజిస్టిక్స్‌ను అభివృద్ధి చేయడంలో మనకు సాయపడుతుంది” అని చెప్పారు. ‘‘ఐఎంఈసీ ప్రాజెక్టు చాలా కాలంగా చర్చల్లో ఉంది. బహుశా కొన్ని సంవత్సరాలుగా కూడా కావచ్చు. నిజం చెప్పాలంటే.. చివరి నిమిషంలో అమెరికన్లు ఆ ప్రాజెక్టులో చేరారు. అయితే ఎందుకు భాగం కావాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. వ్యాపారంపై ఆసక్తితో కావచ్చు” అని అన్నారు. 

గతంలోనూ మేకిన్ ఇండియాపై ప్రశంసలు
2014లో మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దిగుమతులను తగ్గించుకోవాలని, మన దేశంలోనే తయారీని ప్రోత్సహించాలని ఈ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. పెట్టుబడులను, ఆవిష్కరణలను, స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన మేకిన్‌ ఇండియా కార్యక్రమం ఆసాధారణ ఫలితాలను సాధించింది. ఎన్నో ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇండియాలో పెట్టుబడులు పెట్టి, తయారీని ప్రారంభించాయి. మరోవైపు మేకిన్ ఇండియా గురించి పుతిన్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘రష్యాకు గొప్ప స్నేహితుడైన మోదీ.. కొన్నేళ్ల కిందట ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన స్నేహితుడు చేసింది సత్ఫలితాలనిస్తుంటే.. దాన్ని అనుకరించడం తప్పేమీ కాదు” అని చెప్పుకొచ్చారు. మరోవైపు తన బిజీ షెడ్యూల్ కారణంగా జీ20 సమిట్‌కు రాలేపోతున్నట్లు పుతిన్ తెలియజేశారు. ఆయన స్థానంలో రష్యా మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ను పంపారు.