నమ్మక ద్రోహాన్ని మాత్రం క్షమించను..

విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృతి నేపథ్యంలో గతంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నమ్మక ద్రోహాన్ని  ఎన్నిటికీ క్షమించబోనని 2018లోనే పుతిన్ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నీడలో ఎదిగాడు.. ఓ ప్రైవేటు సైన్యానికి అధిపతి అయ్యాడు. చివరికి తనను పెంచి పోషించిన వ్యక్తిపైనే తిరుగుబాటు చేసి సంచలనం రేపాడు. తర్వాత వెనక్కి తగ్గాడు కానీ.. అనుమానాస్పద ప్రమాదంలో చనిపోయాడు. వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ ఘటన.. చూడటానికి ప్రమాదం మాదిరే కనిపిస్తున్నా […]

Share:

విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృతి నేపథ్యంలో గతంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నమ్మక ద్రోహాన్ని  ఎన్నిటికీ క్షమించబోనని 2018లోనే పుతిన్ అన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నీడలో ఎదిగాడు.. ఓ ప్రైవేటు సైన్యానికి అధిపతి అయ్యాడు. చివరికి తనను పెంచి పోషించిన వ్యక్తిపైనే తిరుగుబాటు చేసి సంచలనం రేపాడు. తర్వాత వెనక్కి తగ్గాడు కానీ.. అనుమానాస్పద ప్రమాదంలో చనిపోయాడు. వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ ఘటన.. చూడటానికి ప్రమాదం మాదిరే కనిపిస్తున్నా అది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన పనే అని ప్రపంచంలోని చాలా దేశాల అధినేతలు ఆరోపిస్తున్నారు. రష్యాకు సంబంధించి గతంలో ఇలా ఎన్నో అనుమానాస్పద మరణాలు నమోదు కావడమే ఇందుకు కారణం. మరోవైపు గతంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. 

సోషల్ మీడియాలో వీడియో వైరల్

రెండు రోజుల కిందట రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో కిరాయి సైన్యం ‘వాగ్నర్’ గ్రూపు చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వాగ్నర్ గ్రూప్ సెకండ్ ఇన్ కమాండ్ దిమిత్రి ఉత్కిన్ సహా 10 మంది దాకా చనిపోయారు. ఈ నేపథ్యంలో గతంలో పుతిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018లో జరిగిన ఇంటర్వ్యూలో.. ‘మీకు క్షమించడం తెలుసా? మీరు క్షమించే వ్యక్తేనా?’ అని యాంకర్ అడిగారు. అందుకు అవునని పుతిన్ బదులిచ్చారు. కానీ అన్ని సమయాల్లో కాదని వెంటనే చెప్పారు. దీంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. ‘మీరు క్షమించని విషయం ఏది?’ అని అడగ్గా.. ‘నమ్మక ద్రోహం’ అని చెప్పారు. తనకు ద్రోహం చేసిన వాళ్లను క్షమించబోనని స్పష్టంగా చెప్పారు. ప్రిగోజిన్ మృతి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

తీవ్రమైన తప్పులు చేశాడు..

మరోవైపు ప్రిగోజన్‌ మరణంపై పుతిన్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదం ఓ విషాదకర సంఘటన అని చెప్పారు. ప్రిగోజిన్ తన జీవితంలో ఎన్నో తీవ్రమైన తప్పులు చేశాడని అన్నారు. అయినప్పటికీ ఎంతో ప్రతిభగల వ్యక్తి అని, అనుకున్న ఫలితాలు సాధించాడని చెప్పారు. 

‘‘ప్రిగోజిన్ నాకు 1990ల నాటి నుంచే తెలుసు. తన జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను చూశాడు. ఇప్పటిదాకా ఎన్నో తీవ్రమైన తప్పులు చేశాడు. కానీ అనుకున్న ఫలితాలనే అతడు సాధించాడు” అని వీడియోలో చెప్పారు. ప్రమాదం జరగడానికి ఒకరోజు ముందే ఆఫ్రికా నుంచి రష్యాకు ప్రిగోజిన్ చేరుకున్నాడని, కొందరు అధికారులతో కూడా సమావేశమయ్యాడని వివరించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు కొంచెం సమయం పడుతుందని అన్నారు. ప్రిగోజిన్‌తోపాటు చనిపోయిన ఇతర వాగ్నర్ గ్రూప్ సభ్యుల సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు.

పుతిన్‌పైనే అనుమానాలు

గత జూన్‌ నెలలో పుతిన్‌కు వ్యతిరేకంగా ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేశాడు. అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే బెలారస్ అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో వెనక్కి తగ్గారు. తర్వాత పుతిన్, ప్రిగోజిన్ భేటీ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ప్రిగోజిన్ చనిపోయారు. ప్రపంచ దేశాల నేతలు.. ప్రిగోజిన్‌ది హత్యేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదం యాదృచ్ఛికంగా జరగలేదని, కావాలనే కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి కారణం ఎవరో తమకు తెలుసంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పరోక్షంగా పుతిన్‌పై ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందో తనకు తెలియదు కానీ, ప్రిగోజిన్ మరణం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. మరోవైపు ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్.. ‘‘నేను ఊహించిన దానికంటే ఆలస్యమైంది. ఇది మానసిక యుద్ధ తంత్రం కూడా కావచ్చు” అని అన్నారు.