స్పెయిన్‌లోని మ్యాగజైన్ కవర్‌ పేజీపై.. బహిష్కరణకు గురైన ఇరానియన్ చెస్ క్రీడాకారిణి సారా కదీమ్ చిత్రం

తలపై హిజాబ్ లేకుండా చెస్ టోర్నమెంట్‌లో పాల్గొని, ప్రవాసంలోకి వెళ్లిన కొద్ది నెలల తర్వాత, సారా కదీమ్ యొక్క చిత్రం ఎల్లే మ్యాగజైన్ యొక్క స్పానిష్ ఆన్‌లైన్ ఎడిషన్ కవర్‌పైన కనబడింది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పానిష్ ఆన్‌లైన్ ఎడిషన్ పత్రిక ఈ ముఖ చిత్రాన్ని రూపొందించింది. 25 ఏళ్ల కదీమ్.. గత డిసెంబర్‌లో అల్మాటీలో జరిగిన 2022 ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లకు తలకు హిజాబ్ లేకుండా […]

Share:

తలపై హిజాబ్ లేకుండా చెస్ టోర్నమెంట్‌లో పాల్గొని, ప్రవాసంలోకి వెళ్లిన కొద్ది నెలల తర్వాత, సారా కదీమ్ యొక్క చిత్రం ఎల్లే మ్యాగజైన్ యొక్క స్పానిష్ ఆన్‌లైన్ ఎడిషన్ కవర్‌పైన కనబడింది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పానిష్ ఆన్‌లైన్ ఎడిషన్ పత్రిక ఈ ముఖ చిత్రాన్ని రూపొందించింది.

25 ఏళ్ల కదీమ్.. గత డిసెంబర్‌లో అల్మాటీలో జరిగిన 2022 ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లకు తలకు హిజాబ్ లేకుండా హాజరై ముఖ్యాంశాలలో నిలిచింది.

ఇరాన్ వస్త్రధారణలో మహిళలు హిజాబ్ తప్పక ధరించాలి. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ.. కజకిస్థాన్‌లో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇరాన్‌కు చెందిన సారా కదీమ్ అనే అమ్మాయి హిజాబ్ లేకుండా టోర్నమెంట్ లో పాల్గొంది. ఇరాన్ ప్రభుత్వానికి నిరసనగా ఆమె ఇలా చేసింది. ఈ సంఘటన తరువాత, ఆమె ఇరాన్ నుండి తన దత్తత దేశమైన స్పెయిన్‌కు పారిపోవాల్సి వచ్చింది. ఆమె ప్రస్తుతం ఈ ఐబీరియన్ దేశంలో తన భర్త, ఏడాది కొడుకుతో కలిసి నివసిస్తోంది.

అయితే ఇప్పటివరకు ఆమె ఎక్కడా హిజాబ్ సమస్యపై స్పందించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) ర్యాంకింగ్స్ ప్రకారం, సారా కదీమ్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 804వ స్థానంలో ఉంది. 

అసలు ఇరాన్ లో ఏమి జరుగుతోంది?

సెప్టెంబరు 2022 లో  మహస అమిని అనే స్త్రీ హిజాబ్ సరిగా ధరించలేదని, ఆ నియమాన్ని ఉల్లంఘించిందని, పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసు కస్టడీలో ఉన్న అమిని అనుమానాస్పదంగా చనిపోయింది. ఇరాన్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 

ఆమె మరణానంతరం మొదలైన ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నిరసనలకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ ఆందోళనలు ప్రపంచపు దృష్టిని ఆకర్షించాయి. ఈ ఉద్యమాల్లో మహిళలు ముఖ్యపాత్ర పోషించారు. మహిళలు హిజాబ్ ధరించకపోవడమే కాకుండా, దేశ నాయకత్వానికి నిరసన సందేశం పంపేందుకు  హిజాబ్ లను దహనం చేశారు. ఈ నిరసనలలో ఎందరో పౌరులు మరణించారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ కి ఆ దేశపు కోర్టు మరణశిక్ష కూడా విధించింది.

ఈ నిరసనల సందర్భంగా  ఇరాన్‌లో అనేక అల్లర్లు జరిగాయి. ఈ నిరసనల్లో పాల్గొన్నందుకు ఇప్పటివరకు 11 మందికి మరణశిక్ష విధించగా, వందలాది మందికి జైలు శిక్ష పడింది.

అంతర్జాతీయ వేదికలపై నిరసన కార్యక్రమాలతో ఇరానియన్ పురుష, మహిళా క్రీడాకారులు ఈ నిరసనకు మద్దతు ఇచ్చారు. ఇరాన్ పర్వతారోహకురాలు ఎల్నాజ్ రెకాబి దక్షిణ కొరియాలో హిజాబ్ లేకుండా పోటీలో పాల్గొన్నది. ఖతార్‌లో జరిగిన 2022 FIFA ప్రపంచ కప్‌లో జాతీయ గీతాన్ని ఆలపించకుండా ఇరాన్ ఫుట్‌బాల్ ఆటగాళ్ళు ఆ దేశ నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఆ నిరసనలు చెస్ ప్రపంచంలో కూడా ప్రభావం చూపాయి. హిజాబ్ ధరించని సారా కదీమ్ ప్రవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. పురుష గ్రాండ్ మాస్టర్ అలీరెజా ఫిరౌజ్జా కూడా ఫ్రాన్స్‌కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు.