మాల్దీవులకు తడిసిపోయేలా చేస్తున్న భారతీయులు.. ఈజ్ మై ట్రిప్ కీలక నిర్ణయం!

Boycott Maldives: భారత ప్రధాని మోదీ ఇటీవల చేసిన లక్ష ద్వీప్ పర్యటన మాల్దీవులకు చుక్కలు చూపిస్తోంది. మోదీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశానికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

Courtesy: x

Share:

భారత ప్రధాని మోదీ ఇటీవల చేసిన లక్ష ద్వీప్ పర్యటన మాల్దీవులకు చుక్కలు చూపిస్తోంది. మోదీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశానికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. భారత్‌పై, భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు విషం కక్కడంపై సోషల్ మీడియాలో భారతీయులు అక్కడి నాయకులకు తడిసిపోయేలా చేస్తున్నారు. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో భారతీయులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు.. తమ టూర్‌లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. మరోవైపు.. భారత్‌పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది మాత్రం వెల్లడించలేదు. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం, మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్‌ జిహాన్‌లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ తాజాగా వెల్లడించారు. షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు. 

ఇక మాల్దీవులుకు చెందిన రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. నెటిజన్లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు. భారత్ లోని లక్షద్వీప్, సింధుదుర్గ్ లాంటి ద్వీపాలను సందర్శించాలని సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్​ అబ్రహం, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ దీనికి మద్దతు తెలుపుతూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. మరోవైపు భారత్‌తో వివాదం వేళ మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన అన్ని వెబ్‌సైట్లు సాంకేతిక లోపం తలెత్తి డౌన్‌ అయ్యాయి.

ఈజ్ మై ట్రిప్ కీలక నిర్ణయం
భారత్‌పై విషం వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌(EaseMyTrip) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్‌ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. నిషాంత్‌ పిట్టి, రికాంత్‌ పిట్టి, ప్రశాంత్‌ పిట్టి దీనిని 2008లో స్థాపించారు

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని మోదీ సూచించారు. అయితే దాన్ని తప్పుపడుతూ భారత్‌పై, ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.