భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్..

అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద దేశాధ్యక్షుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. వివాదాస్పద చర్యలతో ప్రెసిడెంట్‌ అయిన ఆయన.. అవే వివాదాస్పద తీరుతో గద్దె దిగారు. ఇప్పుడు మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంపై ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలను విధిస్తోందని మండిపడ్డారు. హార్లే డేవిడ్సన్ వంటి బైకులపై అత్యధిక పన్నులు విధిస్తోందని ఆరోపించారు. తాను మళ్లీ అధికారంలోకి […]

Share:

అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద దేశాధ్యక్షుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. వివాదాస్పద చర్యలతో ప్రెసిడెంట్‌ అయిన ఆయన.. అవే వివాదాస్పద తీరుతో గద్దె దిగారు. ఇప్పుడు మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంపై ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలను విధిస్తోందని మండిపడ్డారు. హార్లే డేవిడ్సన్ వంటి బైకులపై అత్యధిక పన్నులు విధిస్తోందని ఆరోపించారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే రిసిప్రోకల్ పన్నును భారత్‌పై విధిస్తానని ప్రకటించారు. 

టారిఫ్ కింగ్ అంటూ విమర్శలు

2019లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. భారత్‌ను ‘టారీఫ్ కింగ్’ అంటూ ట్రంప్ విమర్శించారు. జెనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్‌ (జీఎస్పీ) ను రద్దు చేశారు. సమానమైన, సహేతుకమైన విధానానాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ఆరోపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. ప్రతీకార పన్నులు విధిస్తానని హెచ్చరించారు. 

హార్లే డేవిడ్సన్ బైక్‌ వంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో టారీఫ్‌లు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు. 100, 150, 200 శాతం పన్నులు వేస్తోందని మండిపడ్డారు. ‘‘పన్నులు ఇలా ఉంటే.. మన కంపెనీలు భారతదేశంలో ఎలా వ్యాపారం చేయగలవు? మనం అక్కడికి వెళ్లి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే టారీఫ్‌లు ఉండవు. అలా చేయాలనే భారత్ కోరుకుంటోంది” అని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. 

ప్రతీకార పన్ను విధిస్తా

‘‘మన ఉత్పత్తులకు భారత్ 200 శాతం పన్నులు విధిస్తుంటే.. మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు విధించకూడదా? మోటార్‌‌బైక్‌ను ఇక్కడ ఎలాంటి పన్ను, టారీఫ్ లేకుండా అమ్ముతారు. కానీ ఇక్కడ హార్లేని తయారు చేసి, అమ్మితే మాత్రం భారీగా పన్నులు కట్టాలా? వాళ్లకు మనం పన్నులు కడితే.. వారి నుంచి కూడా పన్నులు వసూలు చేయాల్సిందే. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే.. భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను (రిసిప్రోకల్ పన్ను)ను విధిస్తాను” అని ఆయన ప్రకటించారు.

‘‘ఇండియా, బ్రెజిల్‌లో భారీగా సుంకాలు ఉన్నాయి. చాలా అధికంగా ఉన్నాయి. వాళ్లు మనపై 200 శాతం చార్జ్ చేస్తుంటే.. మనం ఎలాంటి పన్ను విధించడం లేదు. ఇది ఫ్రీ ట్రేడ్ కాదు.. ఈ పన్నును 50 శాతానికి మార్చగలమా? కనీసం 25 శాతానికి లేదా 10 శాతానికి? అలా చేయలేం. మరి అసలు ఏం జరుగుతోంది? ఎక్కడో ఎదో తప్పు జరుగుతోంది. ప్రతీకారం అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి. మీకు కావాల్సిన విధంగా పిలుచుకోండి. వాళ్లు మాతో పన్నులు వసూలు చేస్తే.. మేం కూడా వాళ్ల నుంచి వసూలు చేస్తాం” అని ప్రకటించారు. 

వివాదాలకు కేరాఫ్ అడ్రస్

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా కన్నా.. వివాదాలతోనే ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. ముందు నుంచి ఆయనది వివాదాస్పద తీరే. అధ్యక్షుడు కాకముందే ఆయన వ్యాపారాల్లో ఉన్నారు. అప్పుడు ఆయనకు సంబంధించిన హోటళ్లు, క్యాసినో వ్యాపారాలు దివాళా తీశాయి. పేరుకే దివాళా అని.. అక్కడి చట్టాల్లోని లొసుగులను తనకు అనుకూలంగా ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. రెజ్లర్ల పోటీలు జరిగే ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ ప్రోగ్రామ్‌లోనూ ఆయన పలుమార్లు కనిపించారు. ఓ శృంగార తారతో సంబంధాలు నెరిపారనే ఆరోపణలు దుమారం రేపుతాయి. ఇక అధ్యక్షుడిగా దిగిపోవడానికి ముందు క్యాపిటల్ హౌస్‌పై జరిగిన దాడి.. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు తన అనుచరులను ట్రంప్ రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఆయన ఎదుర్కొంటున్నారు కూడా. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత వ్యతిరేకత ఎదురైనా తెంపరి ట్రంప్ తీరు మాత్రం మరలేదు. మారదు కూడా. ఎందుకంటే ట్రంప్ కదా!