ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

హమాస్‌ మిలిటెంట్ల దాడికి ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతోంది. నగరాన్ని  అన్ని వైపులా దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్‌ హమాస్‌ స్థావరాలపై దాడులను తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే పలు దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి. మరోవైపు హమాస్‌కు అరబ్ దేశం సౌదీ అరేబియా తన మద్దతు తెలిపింది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో సౌదీ యువరాజు ఫోన్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారని సౌదీ జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్ లెబనీస్ సాయుధ […]

Share:

హమాస్‌ మిలిటెంట్ల దాడికి ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతోంది. నగరాన్ని 

అన్ని వైపులా దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్‌ హమాస్‌ స్థావరాలపై దాడులను తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే పలు దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి. మరోవైపు హమాస్‌కు అరబ్ దేశం సౌదీ అరేబియా తన మద్దతు తెలిపింది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో సౌదీ యువరాజు ఫోన్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారని సౌదీ జాతీయ మీడియా తెలిపింది.

ఇరాన్‌కు అమెరికా వార్నింగ్

లెబనీస్ సాయుధ సమూహం హిజ్బుల్లాతో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇజ్రాయెల్ సంక్షోభంలో జోక్యం చేసుకోవద్దని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించింది. తమకు ఇరాన్ మద్దతు ఉందని హమాస్‌ మిలిటెంట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఎయిర్‌ఫోర్స్ జనరల్‌ చార్లెస్‌ క్యూ బ్రౌన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హమాస్‌కు ఇరాన్‌ మద్దుతు ఉందనేందుకు మా వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ, ఈ విషయంలో ఇరాన్‌ జోక్యం చేసుకోవద్దు. హమాస్‌ మద్దతుదారులకు మేం చాలా బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నాం’’ అని చార్లెస్‌ బ్రౌన్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు అవసరమైన అదనపు ఆయుధ సామగ్రి, ఇతర రక్షణ వ్యవస్థలను అమెరికా పంపుతున్నట్లు చెప్పారు. 

పాలస్తీనాకు సౌదీ మద్దతు

‘‘ఇజ్రాయెల్‌ – హమాస్‌ మిలిటెంట్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా పాలస్తీనా ప్రజలకు తోడుగా ఉంటుంది. గౌరవప్రదమైన జీవితం కోసం, చట్టబద్ధమైన హక్కుల కోసం, వారి ఆంకాక్షలను నెరవేర్చుకోవడానికి జరిపే పోరాటంలో పాలస్తీనా ప్రజల పక్షాన నిలబడతాం’’అని సౌదీ యువరాజు పాలస్తీనా అధ్యక్షుడికి స్పష్టం చేసినట్లు సౌదీ జాతీయ మీడియా తెలిపింది. గత నెలలో మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ మాట్లాడుతూ.. పాలస్తీనా అంశం సౌదీ అరేబియాకు ఎంతో ముఖ్యమని, ఆ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

నీలం రంగులో అధినేతల భవనాలు

హమాస్ ఉగ్రవాదుల దాడితో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. హమాస్‌ నుంచి రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌ చేసే అన్ని ప్రయత్నాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా , యూకే , ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ దేశాలు తాజాగా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అటు, ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం, యూకే ప్రధాని నివాసం సహా పలు చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలపై నీలం, తెలుపు వర్ణాలను ప్రదర్శించాయి.

అమెరికాలో వైట్‌హౌస్‌, న్యూయార్క్‌లోని ది ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అధికారిక నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌, యూకే పార్లమెంట్‌ ది ప్యాలెస్‌ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌, బ్రస్సెల్స్‌లోని ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం, ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌, ఆస్ట్రేలియాలోని ప్రముఖ సిడ్నీ ఒపెరా హౌస్‌, బెర్లిన్‌లోని ది బ్రాండెన్‌బర్గ్‌ గేట్ తదితర చారిత్రక కట్టడాలపై ఇజ్రాయెల్‌ జెండాను, ఆ దేశ జెండాలోని నీలం, తెలుపు రంగులను ప్రదర్శించారు.

ఇజ్రాయెల్‌పై జరిగిన దాడితో అమెరికన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. హమాస్‌ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు ఉంటుందన్న ఆయన,  హమాస్‌ చేతిలో బందీలుగా చిక్కిన ఇజ్రాయెల్‌ పౌరులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య శాశ్వత శాంతి నెలకొనేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. 

మరోవైపు ఇజ్రాయెల్‌పై దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కారణమంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇలాంటి దాడి జరిగేది కాదన్నారు. ‘‘అమెరికాకు వలస వచ్చే వారిలో చాలా మంది ఎక్కడి నుంచి వస్తున్నారనేది తెలియడంలేదు. అలాంటి వాళ్లే ఇజ్రాయెల్‌ వంటి దేశాలపై దాడులు చేస్తున్నారు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే.. ఇలాంటి ఘటనలు జరిగేవి కావు. మహిళలు, చిన్న పిల్లలను క్రూరంగా చంపేశారు. ఇది చాలా దారుణమైన చర్య’’ అని ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.