కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్..

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్, కెనడాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని ఇండియన్ హ్యాకర్స్‌ హ్యాక్ చేసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. భారత్‌ కెనడా మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్న క్రమంలోనే ఓ నివేదిక సంచలన విషయం వెల్లడించింది. కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ హ్యాక్‌కి గురైంది. ది టెలిగ్రాఫ్  వెల్లడించిన వివరాల ప్రకారం…’ఇండియన్ సైబర్ ఫోర్స్’ గ్రూప్‌ హ్యాకర్స్ ఈ హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తోంది. ట్విటర్‌లో […]

Share:

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్, కెనడాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని ఇండియన్ హ్యాకర్స్‌ హ్యాక్ చేసినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

భారత్‌ కెనడా మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్న క్రమంలోనే ఓ నివేదిక సంచలన విషయం వెల్లడించింది. కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ హ్యాక్‌కి గురైంది. ది టెలిగ్రాఫ్  వెల్లడించిన వివరాల ప్రకారం…’ఇండియన్ సైబర్ ఫోర్స్’ గ్రూప్‌ హ్యాకర్స్ ఈ హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తోంది. ట్విటర్‌లో పోస్ట్ కూడా పెట్టింది ఈ గ్రూప్. మధ్యాహ్నం సైట్ పని చేయడం ఆగిపోయింది.  కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసినట్టు వరుస ట్వీట్‌లు చేసింది. ఇది సోషల్ మీడియాలో సంచలనమైంది. ఉన్నట్టుండి సైట్ పని చేయకుండా పోయింది. ఆ తరవాత కాసేపటికి రికవర్ అయింది.

ట్విటర్‌లో ఇండియన్ సైబర్ ఫోర్స్ చేసిన ట్వీట్‌లు వైరల్ అయ్యాయి. “కెనడా ఎయిర్‌ఫోర్స్ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేశాం” అని ట్వీట్ చేసింది. వెబ్‌సైట్‌లో ఎర్రర్ మెసేజ్ వస్తుండడాన్ని స్క్రీన్‌షాట్‌లు తీసి మరీ పోస్ట్ చేసింది. కెనడాలో నౌకాదళం, ప్రత్యేక కమాండ్ గ్రూపులు, వైమానిక, అంతరిక్ష, సైనిక కార్యకలాపాలను కలిగి ఉన్న ప్రత్యేక దళాలు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాయి. కెనడియన్ సైబర్‌స్పేస్‌పై దాడి చేస్తామంటూ ఇండియన్ సైబర్ ఫోర్స్ సెప్టెంబర్ 21న కెనడాను బెదిరించింది. హర్దీప్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలపై భారత్ భగ్గుమంది. అప్పుడి నుంచి ఆ దేశానికి సైబర్ హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే సాయుధ దళాల వెబ్ సైట్ హ్యాక్ కావడం వివాదాన్ని మరింత పెద్దదిగా చేసింది. 

ది గ్లోబ్ అండ్ మెయిల్ రిపోర్ట్ ప్రకారం..చాలా సేపు ఈ వెబ్‌సైట్ పని చేయలేదు. డెస్క్‌టాప్ వర్షన్‌లో వెబ్‌సైట్ ఓపెన్ అయినప్పటికీ…మొబైళ్లలో మాత్రం ఓపెన్ కాలేదు. చివరికి ఈ సైట్‌ని ఐసోలేట్ చేసింది కెనడా ప్రభుత్వం. ఈ హ్యాకింగ్ వల్ల పెద్ద సమస్యేమీ రాలేదని, ప్రభావం పడలేదని వెల్లడించింది. కెనడా భద్రతా బలగాలతో పాటు మిగతా సెక్యూరిటీ గ్రూప్‌లు ఈ హ్యాకింగ్‌పై విచారణ మొదలు పెట్టాయి. 

ఇప్పటికే నిజ్జర్ హత్యపై భారత్, కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించింది భారత్. ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేసింది. కానీ…ఈ ఆరోపణలపై ట్రూడో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ఇంకా కవ్వింపులకు పాల్పడుతున్నారు. ఇక కెనడాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలు కూడా దొరికాయి. ఫలితంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 

హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్. న్యూయార్క్‌లో కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయనను మీడియా ప్రశ్నించింది.  ఫైవ్ ఐస్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌పైనా స్పందన ఏంటని అడిగింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన జైశంకర్…ఆ ఇంటిలిజెన్స్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎఫ్బిఐతో ఏ మాత్రం సంబంధం లేని తనను ఈ ప్రశ్నలు అడగడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తరవాత కూడా మీడియా ప్రశ్నించింది. నిజ్జర్‌ హత్య గురించి ముందుగానే కెనడా భారత్‌కి చెప్పిందని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చిందన్న అంశాన్ని మీడియా ప్రస్తావించింది. అందుకు జైశంకర్ ధీటుగానే బదులిచ్చారు. ఎవరైనా అలాంటి సమాచారం అందిస్తే కచ్చితంగా అలెర్ట్ అవుతామని వెల్లడించారు. నిజ్జర్ హత్యకి సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.