అగ్నికి ఆజ్యం పోస్తున్న కెనడా..

భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులకు కెనడా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అత్యవసరమైతే తప్ప భారత్‌కు ప్రయాణం చేయవద్దని, భద్రతను ప్రమాదంలో పెట్టవద్దని హెచ్చరికలు జారీ చేసింది.  ఇండియా, కెనడా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎన్నడూలేనంతగా దిగజారాయి. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో […]

Share:

భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులకు కెనడా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అత్యవసరమైతే తప్ప భారత్‌కు ప్రయాణం చేయవద్దని, భద్రతను ప్రమాదంలో పెట్టవద్దని హెచ్చరికలు జారీ చేసింది. 

ఇండియా, కెనడా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎన్నడూలేనంతగా దిగజారాయి. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో తమ దేశంలో ఉన్న భారత రాయబారిని కెనడా బహిష్కరించగా.. అందుకు బదులుగా భారత్ కూడా ఇక్కడి కెనడా రాయబారిని బహిష్కరించింది. ఇదిలా ఉండగానే భారత్‌లో పర్యటిస్తున్న తమ పౌరులకు కెనడా పలు హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో ఉన్నప్పుడు కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసింది. 

ఆ దేశాన్ని వదిలి రండి..

ఈ మేరకు కెనడా ప్రభుత్వం తమ వెబ్‌సైట్‌లో అడ్వైజరీని జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప భారత్‌కు ప్రయాణం చేయవద్దని తమ పౌరులకు కెనడా సూచించింది. భద్రతను ప్రమాదంలో పెట్టవద్దని చెప్పింది. ‘‘కుటుంబ, వ్యాపార సంబంధ లేదా టూర్‌‌కు ఇండియాకు వెళ్లాలన్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే.. అత్యవసరమనుకుంటనే అక్కడ ఉండండి. లేదనుకుంటే వెంటనే ఆ దేశాన్ని వదిలి రండి” అని సూచించింది.

‘‘భారత్‌లో ఉగ్రదాడుల ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో కెనడా పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ, భద్రతా సమస్యలు ఎప్పుడైనా ఉత్పన్నం కావచ్చు. పరిస్థితులు వెనువెంటనే మారవచ్చు. నిరంతరం అప్రమత్తంగా ఉండండి” అని పేర్కొంది. అనూహ్యమైన భద్రతా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌‌కు ప్రయాణాన్ని మానుకోవాలని కెనడా సూచించింది. ఉగ్రముప్పు, మిలిటెన్సీ, అశాంతి, కిడ్నాప్ ముప్ప ఉందని, కాశ్మీర్‌‌లో పర్యటించవద్దని అడ్వైజరీలో పేర్కొంది. ‘‘అస్సాం, మణిపూర్‌‌లో అనేక తీవ్రవాద, తిరుగుబాటు గ్రూపులు అత్యంత యాక్టివ్‌గా ఉన్నాయి. వాళ్లు స్థానిక ప్రభుత్వాన్ని, భద్రతా దళాలను క్రమం తప్పకుండా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారు. అక్కడి ఘర్షణలు అల్లర్లకు దారి తీసే ప్రమాదం ఉంది” అని పేర్కొంది.  

భారత్‌ను రెచ్చగొట్టాలని అనుకోవడం లేదంటూనే..

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపరిచి మరీ ఆయన ఈ ఆరోపణలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన స్వరం మార్చారు. భారత్‌ను తాము రెచ్చగొట్టాలని, లేదా ఉద్రిక్తతలు పెంచాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే సిక్కు నేత హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నామని అన్నారు.  ప్రతి విషయం స్పష్టంగానే ఉందని, సరైన విధానంతోనే సాగుతున్నదని నిర్ధారించుకునేందుకు భారత్‌తో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. కెనడా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

తీవ్రంగా స్పందించిన భారత్

జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత విదేశాంగ శాఖ దీటుగా స్పందించింది. కెనడాలో జరిగిన హింసను భారత ప్రభుత్వంతో ముడిపెట్టడమేంటని ప్రశ్నించింది. ఇలాంటి ఆరోపణలనే ఇటీవల జీ20 సమిట్ సందర్భంగా భారత ప్రధాని ముందు చేశారని, వాటిని ప్రధాని మోదీ పూర్తిగా తిరస్కరించారని చెప్పింది. ‘‘కెనడాలో ఆశ్రయం పొందుతూ భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉగ్రవాదులు, తీవ్రవాదులపై నుంచి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి ఆరోపణలను కెనడా చేస్తోంది” అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో రాష్ట్రంలో సర్రే సిటీలో గురుద్వారా వద్ద హర్దీప్ సింగ్ నిజ్జర్‌‌పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. కెనడా వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఖలిస్తాన్ టైగర్స్ ఫ్రంట్‌ను భారత్ గతంలోనే నిషేధించింది. హర్దీప్‌ను కరుడుగట్టిన ఉగ్రవాదుల జాబితాలో ఎన్‌ఐఏ చేర్చింది. అతడిపై 10 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది.