పిల్లాడి ప్రాణం మీదికి తెచ్చిన ఎనర్జీ డ్రింక్

ఎనర్జీ డ్రింక్స్.. ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. సినిమా స్టార్లు, క్రికెటర్లు సహా ప్రముఖులు వాటిని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆయా హెల్త్ డ్రింక్స్‌ లేబుల్స్‌ను పెద్దగా ప్రింట్ చేసుకుని, హెచ్చరికలను మాత్రం చాలా చిన్నగా ముద్రిస్తున్నారు. దీంతో చిన్నారులు, పిల్లలు తాగొచ్చా లేదా అనేది తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిక కెఫీన్ ఉన్న డ్రింక్ తాగి ఓ పిల్లాడు ఆసుపత్రిపాలయ్యాడు. దీంతో అధిక కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింకుల విషయంలో అవగాహన కల్పించాలని అతడి […]

Share:

ఎనర్జీ డ్రింక్స్.. ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. సినిమా స్టార్లు, క్రికెటర్లు సహా ప్రముఖులు వాటిని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆయా హెల్త్ డ్రింక్స్‌ లేబుల్స్‌ను పెద్దగా ప్రింట్ చేసుకుని, హెచ్చరికలను మాత్రం చాలా చిన్నగా ముద్రిస్తున్నారు. దీంతో చిన్నారులు, పిల్లలు తాగొచ్చా లేదా అనేది తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిక కెఫీన్ ఉన్న డ్రింక్ తాగి ఓ పిల్లాడు ఆసుపత్రిపాలయ్యాడు. దీంతో అధిక కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింకుల విషయంలో అవగాహన కల్పించాలని అతడి తండ్రి కోరుతున్నాడు. ఇదే సమయంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితిని అందరికీ తెలియజేస్తున్నాడు.

రెట్టింపు కెఫీన్ ఉన్న డ్రింక్ తాగడంతో..

బ్రిటన్‌లోని లండన్‌లో లువాన్ తుషా నివసిస్తున్నాడు. అతడికి 8 ఏళ్ల ఫాబియాన్ అనే కొడుకు ఉన్నాడు. ఇటీవల వీరి ఫ్యామిలీ ‘బ్లూ రాస్ప్‌బెర్రీ ప్రైమ్ ఎనర్జీ’ డ్రింక్‌ను తెచ్చుకుంది. సాధారణ ఎనర్జీ డ్రింకుతో పోలిస్తే ఇందులో రెట్టింపు స్థాయిలో కెఫీన్ ఉంటుందని తెలియక వాటిని కొనింది. సాధారణ డ్రింక్ అనుకుని ఫాబియాన్ ఆ పానీయాన్ని తాగాడు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఎన్నడూ ఎదురుకాని రియాక్షన్స్ ఎదుర్కొన్నాడు. హృదయ స్పందన రేటు విపరీతంగా పెరిగింది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. ‘‘ఫాబియాన్ హార్ట్ రేటు 145 బీపీఎం (బీట్స్ పర్ మినిట్‌) కు పెరిగింది. గుండె కొట్టుకుంటున్న వేగానికి అతడి టీషర్ట్‌పై కదలికలు కనిపించాయి. తను ఊపిరి పీల్చుకోలేకపోయాడు” అని లువాన్ తుషా చెప్పాడు.

నిపుణుల హెచ్చరికలు

శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింకుల్లో కెఫీన్ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిని గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 10 ఏళ్ల లోపు పిల్లలు తాగకూడదని ఆయా బాటిల్స్ మీదనే హెచ్చరికలు ప్రింట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధిక కెఫీన్ తీసుకోవడం ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల శరీర బరువు తక్కువగా ఉండటం, విభిన్న జీవ ప్రక్రియ కారణంగా ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 

ప్యాకింగ్ ఒకేలా ఉండటంతో సమస్య

ప్రైమ్ ఎనర్జీ డ్రింక్ ప్యాకింగ్.. ప్రైమ్ హైడ్రేషన్ అనే మరో డ్రింక్‌ మాదిరే ఉంటుంది. ఎనర్జీ డ్రింక్‌లో కెఫీన్ ఉంటుంది. కానీ హైడ్రేషన్ డ్రింక్‌లో ఎలాంటి  కెఫీన్ ఉండదు. రెండింటి ప్యాకింగ్ ఒకేలా ఉండటంతో హైడ్రేషన్ డ్రింక్ అనుకుని.. ప్రైమ్‌ను తీసుకెళ్తున్నారు. పిల్లలు దాన్ని తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు.

అవగాహన పెంచాలి

తన కొడుక్కి ఎదురైన సమస్య ఇంకెవరికీ ఎదురుకాకూడదని లువాన్ తుషా అంటున్నాడు. ఎనర్జీ డ్రింకుల విషయంలో అవగాహనను పెంచాలని కోరుతున్నాడు. అధిక కెఫీన్ ఉన్న డ్రింకులను అమ్మే విషయంలో కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాడు. ‘‘ఆ డ్రింక్ దాదాపు నా కొడుకును చంపినంత పని చేసింది. పిల్లలు ఆ డ్రింక్ తాగకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని చెప్పాడు. మరోవైపు బ్రిటన్‌లో సూపర్‌‌మార్కెట్లలో ఎనర్జీ డ్రింకుల అమ్మకాల విషయంలో ఇప్పటికే ఆంక్షలు విధించారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు అమ్మడం లేదు. 

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు

కొన్ని ప్రముఖ ఎనర్జీ డ్రింక్స్‌లో దాదాపు రెట్టింపు స్థాయిలో కెఫీన్ కంటెంట్ ఉంటోంది. దీని వల్ల నిద్రాభంగం, ఇతర దుష్ప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రైమ్ ఎనర్జీ డ్రింక్‌లో బీ విటమిన్స్‌ అధిక స్థాయిలో ఉంటాయి. ఇలా ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఫాబియన్ ఘటనపై స్పందించేందుకు ప్రైమ్ ఎనర్జీ సంస్థ నిరాకరించింది. మనలోనూ చాలా మంది కూల్‌ డ్రింకులను తెగ తాగేస్తుంటారు. స్టార్లు ప్రమోట్ చేస్తారనో, తాగితే బాగుంటుందనో తీసుకుంటూ ఉంటారు. కొందరు తమ పిల్లలకు తాగిస్తుంటారు. ఫాబియాన్ ఘటన తర్వాతైనా తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.