Donald Trump కు షాక్ ల మీద షాక్ లు.. అభ్యర్థిత్వంపై మరో రాష్ట్రం వేటు!

Donald Trump: అమెరికాలోని మరో రాష్ట్రం కూడా  ఆయనపై వేటు వేసింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు ట్రంప్ అనర్హుడంటూ మైనే (Maine) రాష్ట్రం గురువారం ప్రకటించింది.

Courtesy: x

Share:

అమెరికాలో రాబోయే ఎన్నికల్లో బరిలో ఉండాలని ఉవ్విల్లూరుతున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కు(Donald Trump) వరుస షాక్ లు తగులుతున్నాయి. 2021, జ‌న‌వ‌రి ఆరో తేదీన జ‌రిగిన క్యాపిట‌ల్ హిల్ (US Capitol) అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని ప్రకటించింది. తాజాగా అమెరికాలోని మరో రాష్ట్రం కూడా  ఆయనపై వేటు వేసింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు ట్రంప్ అనర్హుడంటూ మైనే (Maine) రాష్ట్రం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సెక్రటరీ (ప్రధాన ఎన్నికల అధికారి) 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా గురువారం ప్రకటించారు. 

కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. మైనే రాష్ట్రంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్‌ చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్‌.. ట్రంప్‌ పేరును ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ఉత్తర్వులపై ట్రంప్‌ కోర్టుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. అప్పటిదాకా ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో బెల్లోస్‌ నిర్ణయాన్ని రిపబ్లికన్‌ పార్టీ.. మైనే రాష్ట్ర కోర్టుల్లో సవాల్‌ చేయనుంది. కాగా.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఓ ఎన్నికల అధికారి ఇలా బ్యాలెట్‌ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.మరోవైపు ఇప్పటికే కొలరాడో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమిచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ బుధవారం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. మైనే తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు.

2021లో కేపిటల్‌ భవనంపై జరిగిన దాడి కేసులో ట్రంప్‌ ప్రమేయాన్ని నిర్ధారించి రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్షుడిగా అతని పేరును బ్యాలెట్‌లోంచి తొలగించాలని కొలరాడో కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని ప్రకటించింది. రాష్ట్ర రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడానికి ట్రంప్‌నకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం. 2020 అధ్యక్ష ఎన్నికలో ట్రంప్‌ ఓడిపోయినప్పుడు బైడెన్‌ను అడ్డుకోవడానికి.. 2021 జనవరి 6న రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడికి దిగారు. వారిని ట్రంప్‌ సమర్థించారని, హింసను ప్రేరేపించారన్న అభియోగాలపై ఇటీవల కొలరాడో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.