జీ20 విష‌యంలో భార‌త్‌ను ప్ర‌శంసించిన అమెరికా

ఈనెల 9, 10 తేదీల్లో జరిగిన జీ20 సమిట్‌ను భారత దేశం విజయవంతంగా నిర్వహించిందని అమెరికా ప్రశంసించింది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పిలుపునిచ్చే ప్రకటనను జీ20 సమిట్ జారీ చేయగలిగిందని అభిప్రాయపడింది. రెండు రోజుల జీ20 సమిట్‌ను విజయంవంతంగా నిర్వహించి భారత్ చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ విషయంలో అసలు సాధ్యం కాదనుకున్న ఏకాభిప్రాయాన్ని సుసాధ్యం చేసింది. భిన్న ధ్రువాలైన అమెరికా, చైనా వంటి దేశాలనూ, అంటీముట్టనట్లు వ్యహరించిన కెనడానూ, పాకిస్థాన్‌కు కొమ్ముకాసే టర్కీని […]

Share:

ఈనెల 9, 10 తేదీల్లో జరిగిన జీ20 సమిట్‌ను భారత దేశం విజయవంతంగా నిర్వహించిందని అమెరికా ప్రశంసించింది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పిలుపునిచ్చే ప్రకటనను జీ20 సమిట్ జారీ చేయగలిగిందని అభిప్రాయపడింది.

రెండు రోజుల జీ20 సమిట్‌ను విజయంవంతంగా నిర్వహించి భారత్ చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ విషయంలో అసలు సాధ్యం కాదనుకున్న ఏకాభిప్రాయాన్ని సుసాధ్యం చేసింది. భిన్న ధ్రువాలైన అమెరికా, చైనా వంటి దేశాలనూ, అంటీముట్టనట్లు వ్యహరించిన కెనడానూ, పాకిస్థాన్‌కు కొమ్ముకాసే టర్కీని ఒప్పించగలిగింది. ఈ విషయంలో ప్రపంచ దేశాల నుంచి భారత్‌పై, ప్రధానిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో అమెరికా కూడా చేరింది. ఢిల్లీలో జరిగిన జీ20 లీడర్స్ సమిట్‌ విజయవంతమైందని భారత్‌ను ప్రశంసించింది. 

అది చాలా ముఖ్యమైన ప్రకటన

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. జీ20 సక్సెస్ అయిందని మీరు నమ్ముతున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధామిస్తూ.. ‘‘జీ20 సమిట్ విజయవంతమైందని మేం కచ్చితంగా నమ్ముతున్నాం. జీ20 ఒక పెద్ద సంస్థ. రష్యా, చైనా వంటి దేశాలు ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నాయి” అని తెలిపారు. ‘న్యూఢిల్లీ నేతల డిక్లరేషన్‌’లో రష్యా పేరు లేకపోవడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘విభిన్నమైన  అభిప్రాయాలను కలిగి ఉన్న సభ్యులు జీ20లో ఉన్నారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, ఆ సూత్రాలను ఉల్లంఘించకూడదని పిలుపునిచ్చే ప్రకటనను జీ20 సమిట్ జారీ చేయగలిగింది. ఇది చాలా ముఖ్యమైన ప్రకటన అని మేం నమ్ముతున్నాం. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం గురించే ఈ విషయం చెబుతోంది” అని తెలిపారు. 

భారత్, ప్రధానిపై ప్రశంసల వర్షం

‘వసుదైవ కుటుంబం–ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్’ థీమ్‌తో ఈ ఏడాది జీ20 సమిట్‌ను ఢిల్లీలో భారత్ నిర్వహించింది. గత శని, ఆదివారాల్లో జరిగిన సమావేశాలకు ప్రపంచ దేశాల నేతలు విచ్చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాలేదు. తమ దేశాల తరఫున వేరే వాళ్లను ప్రతినిధులుగా పంపారు. డిక్లరేషన్ విషయంలో ఏకాభిప్రాయం రావడం, ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ20లోకి చేర్చుకోవడం వంటివి భారత్ సాధించిన విజయాలు. ఈ విషయంపై ప్రపంచ దేశాలు భారత్, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తున్నాయి. భారతదేశ జీ20 ప్రెసిడెన్సీ ఎన్నో స్పష్టమైన ఫలితాలకు హామీ ఇచ్చిందని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వం వహించారని, గ్లోబల్ సౌత్ గొంతుకను వినిపించారని చెప్పాయి. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్  అనే సందేశం ప్రతినిధులందరిలో బలంగా ప్రతిధ్వనించిందని ప్రపంచ నాయకులు చెప్పారు. 

మనకు ఇదే తొలిసారి

జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. 18వ సమిట్‌ ఈనెల9–10 తేదీల్లో జరిగింది. భారతదేశ సంప్రదాయాలు, బలాలను చూపించేలా ఏర్పాట్లు జరిగాయి. సమ్మిళిత అభివృద్ధి, డిజిటల్ ఇన్నోవేషన్, వాతావరణ స్థితిస్థాపకత, సమానమైన ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ వంటి అంశాలపై జీ20 భారత ప్రెసిడెన్సీ ప్రధానంగా దృష్టి పెట్టింది. గతేడాది జీ20 ప్రెసిడెన్సీని ఇండోనేసియా చేపట్టగా.. ఈ సారి భారత్ నుంచి బాధ్యతలను బ్రెజిల్ చేపట్టింది. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో 19వ జీ20 సమావేశాలు జరగనున్నాయి. అయితే అంతకుముందే జీ20 దేశాల వర్చువల్ సమిట్‌ నవంబర్‌‌లో జరిగే అవకాశం ఉంది. ప్రపంచ జీడీపీలో జీ20 సభ్య దేశాలది 85 శాతం వాటా. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఈ దేశాల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ చేరికతో ఈ సంఖ్యలు మారనున్నాయి. జీ20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి.