Saveera Parkash: పాక్ ఎన్నికల బరిలో తొలిసారి హిందూ మహిళ!

Saveera Parkash: పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేస్తుండటం విశేషం. ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బునేర్‌ జిల్లాలోని ఒక జనరల్‌ స్థానం నుంచి ఆ మహిళ పోటీలో నిలిచారు.

Courtesy: Top Indian News

Share:

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో 2024 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు  ప్రావిన్షియల్‌ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్‌ ప్రక్రియ షురూ అయింది. అయితే, ఈ ఎన్నికల్లో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా  ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేస్తుండటం విశేషం. ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బునేర్‌ జిల్లాలోని ఒక జనరల్‌ స్థానం నుంచి ఆ మహిళ పోటీలో నిలిచారు. పీకే-25 జనరల్ సీటుకు పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) తరఫున అభ్యర్థిగా డాక్టర్‌ సవీరా పర్కాశ్ ఈ నెల 23న నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో పాక్ జనరల్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్న తొలి హిందూ మహిళగా సవీరా రికార్డుల్లో నిలిచారు.

డాక్టర్‌ సవీరా పర్కాశ్ ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్‌ ఇంటర్నేషనల్‌ మెడికల్‌ కాలేజీ నుంచి సవీరా పర్కాశ్ 2022లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అమె తండ్రి ఓమ్‌ ‌పర్కాశ్ కూడా డాక్టర్‌ కావడం విశేషం. ఇటీవలే పదవీ విరమణ చేసిన ఆయన 35 ఏండ్లుగా పీపీపీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న సవీరా, గత కొన్నేండ్లుగా బునేర్‌ పీపీపీ మహిళా విభాగానికి జనరల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. జనరల్‌ స్థానాల్లో తప్పనిసరిగా ఐదు శాతం మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణలు చేసింది. ఈ క్రమంలోనే బునేర్‌ జిల్లాలోని జనరల్‌ స్థానం నుంచి పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ టికెట్‌పై సవీరా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. బునేర్‌ నుంచి సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ కూడా ఈమే కావడం విశేషం.

అభివృద్ధిలో మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని, అణచివేతకు గురిచేస్తున్నారని తన గళాన్ని వినిపిస్తూ సవీరా ఎన్నికల్లో ముందకు వెళ్తున్నారు. తన గెలుపుపై సవీరా పర్కాశ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తమ ప్రాంతంలో మహిళా సాధికారత, భద్రత, మహిళ హక్కుల కోసం ఆమె తన గళాన్ని వినిపిస్తున్నారు. పాకిస్థాన్‌లో 16వ నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తుండగా ఇందులో దాదాపు 3000 మంది మహిళలున్నారు. అయితే, హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ సవీరానే కావడం విశేషం. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బునేర్‌ నుంచి ఆమె పోటీ చేస్తుండటం ఇంకా ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆమెకు సమాజంలో అన్ని వర్గాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది.