93 ఏళ్ల ప్రియుడు, 83 ఏళ్ల ప్రేయసి ఒక్కటి కాబోతున్నారు

అతడు ఆజన్మ బ్రహ్మచారి.. 93 ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. 64 ఏళ్ల కిందట విడిపోయిన తన ప్రేయసితో ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమకు ‘పెద్దలు’ ఒప్పుకున్నారా? ఈ జంట ఒక్కటి కాబోతోందా? ‘‘ప్రేమకు వయసు లేదు.. హద్దు లేదు.. మరణం లేదు..” అంటాడు ప్రఖ్యాత నవలా రచయిత జాన్ గాల్స్‌వర్తీ. అవును.. నిజమే.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరి మనసులో, ఎందుకు పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రేమంటే అంతే.. చెప్పలేని.. చెప్పరానిది. ఓ అనిర్వచనీయ […]

Share:

అతడు ఆజన్మ బ్రహ్మచారి.. 93 ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. 64 ఏళ్ల కిందట విడిపోయిన తన ప్రేయసితో ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమకు ‘పెద్దలు’ ఒప్పుకున్నారా? ఈ జంట ఒక్కటి కాబోతోందా?

‘‘ప్రేమకు వయసు లేదు.. హద్దు లేదు.. మరణం లేదు..” అంటాడు ప్రఖ్యాత నవలా రచయిత జాన్ గాల్స్‌వర్తీ. అవును.. నిజమే.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరి మనసులో, ఎందుకు పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రేమంటే అంతే.. చెప్పలేని.. చెప్పరానిది. ఓ అనిర్వచనీయ అనుభూతి. ఈ వృద్ధుడి కథ కూడా అలాంటిదే. ఏకంగా 93 ఏళ్ల వయసులో తన 83 ఏళ్ల ప్రేయసిని కలుసుకున్నాడు. 64 ఏళ్ల కిందట విడిపోయిన అదే వ్యక్తిని ఇప్పుడు పెళ్లాడబోతున్నాడు. ఇన్నాళ్లూ బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆ నవయువకుడు.. తన ప్రేయసి మరోసారి ప్రేమలో పడ్డానని చెబుతున్నాడు.

1959లో తొలి సారి కలిశారు..

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జోసెఫ్ పొటెన్జానో (93), మేరీ ఎల్కిండ్ (83) జంట.. ప్రేమకు వయసు లేదని నిరూపించింది. ‘‘93 ఏళ్లుగా బ్రహ్మచారిగానే కొనసాగుతున్నాడు జోసెఫ్. పారామాస్‌లో 1959లో జరిగిన తన సోదరి పెళ్లి వేడుకలో మేరీని చూశాడు. అప్పుడు జోసెఫ్‌ను ఓ అందమైన వ్యక్తిగా గుర్తించానని మేరీ చెప్పింది. తర్వాత వారిద్దరూ కొన్నిసార్లు మాట్లాడుకున్నారు. కొన్నిసార్లు డేట్‌కి కూడా వెళ్లారు. కానీ తర్వాత విడిపోయారు” ని మీడియా పోర్టల్ స్టారె లెడ్జర్ వెల్లడించింది. రేడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌లో నృత్య కళాకారిణిగా తన వృత్తిని మేరీ కొనసాగించగా, జోసెఫ్ మిలిటరీలో చేరాడు. 

1962లో మేరీ ఎల్కిండ్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రాక్‌ల్యాండ్ కౌంటీలో ఉంటూ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మేరీ పెళ్లికి, ఆమె జీవితంలో జరిగిన పలు వేడుకలకు కూడా జోసెఫ్ హాజరయ్యాడు. మరోవైపు జోసెఫ్ చాలా మంది మహిళలతో డేటింగ్‌కు వెళ్లినా.. మేరీలో కనిపించిన ‘స్పార్క్‌’ను మిస్సయ్యానని, ఆ డేట్‌లను పెళ్లి దాకా తీసుకుపోలేకపోయానని చెప్పాడు. ఇది చాలా విచిత్రమైన విషయమని, పెళ్లి అనేది తన జీవితంలో ఎప్పుడూ తప్పించుకు తిరిగేదని అన్నాడు. 9 ఏళ్ల కిందట మేరీ భర్త చనిపోయాడు. 

60 ఏళ్ల తర్వాత మళ్లీ డేటింగ్‌కి..

ఇటీవల జరిగిన కుటుంబాల వేడుకలతో పరిస్థితులు మారాయి. ఆయా కార్యక్రమాల కారణంగా జోసెఫ్, మేరీ ఒక్కచోటుకు చేరారు. ఈ సారి మాత్రం వాళ్లు విడిపోలేదు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. గత ఏడాది కాఫీ కోసం మేరీని జోసెఫ్ ఆహ్వానించాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. గతంలోనే ఉండిపోయిన ప్రేమ మళ్లీ మొగ్గ తొడిగింది. ఈ సారి మరింత ప్రకాశవంతంగా వికసించింది. తాను ఇన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నానని, కానీ అలానే చనిపోవాలని ఎన్నడూ అనుకోలేదని జోసెఫ్ చెప్పుకొచ్చాడు. 64 ఏళ్ల కిందట ఆగిపోయిన ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాలనుకుంటున్నాడు. వచ్చే అక్టోబర్ 15న పెళ్లి చేసుకోవాలని వీళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి రెండు కుటుంబాల ‘పెద్దలు’ ఒప్పుకోలేదు. ఈ వయసులో పెళ్లి అవసరమా అని ప్రశ్నించారు. కానీ జోసెఫ్ మాత్రం ఈ నిర్ణయం సరైనదేనని నమ్మాడు. ‘‘నేను ఇది సిగ్గు పడకుండా చెబుతున్నాను. నేను ఆమెతో ప్రేమలో పడ్డాను. ఆమె కూడా నాతో ప్రేమలో పడ్డానని చెప్పింది. ఇంకేం కావాలి?” అని అతడు ప్రశ్నించాడు. దీంతో ‘పెద్దలు’ కూడా అడ్డుచెప్పలేదు. ఈ ‘యువ జంట’కు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.