దసరాకే ‘టైగర్ నాగేశ్వరరావు’ వేట

సైడ్ విలన్‌గా, క్యారెక్టర్‌‌ ఆర్టిస్టుగా, హీరోగా ఒక్కో అడుగు ఎక్కుతూ పైకి వచ్చాడు మాస్ మహరాజ రవితేజ. తనకంటూ ఏ గాడ్ ఫాదర్ లేకున్నా.. స్వయం కృషితో ఎదుగుతూ తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. విలక్షణ నటన, కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నేళ్లుగా వరుస సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. రవితేజ తన కెరియర్‌‌లో తొలిసారి బయోపిక్‌ లాంటి సినిమాలో నటిస్తున్నాడు. అదే ‘టైగర్ నాగేశ్వర‌రావు’. స్టువర్టుపురానికి చెందిన దొంగ కథే […]

Share:

సైడ్ విలన్‌గా, క్యారెక్టర్‌‌ ఆర్టిస్టుగా, హీరోగా ఒక్కో అడుగు ఎక్కుతూ పైకి వచ్చాడు మాస్ మహరాజ రవితేజ. తనకంటూ ఏ గాడ్ ఫాదర్ లేకున్నా.. స్వయం కృషితో ఎదుగుతూ తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. విలక్షణ నటన, కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నేళ్లుగా వరుస సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. రవితేజ తన కెరియర్‌‌లో తొలిసారి బయోపిక్‌ లాంటి సినిమాలో నటిస్తున్నాడు. అదే ‘టైగర్ నాగేశ్వర‌రావు’. స్టువర్టుపురానికి చెందిన దొంగ కథే ఈ సినిమా.

చెప్పిన డేట్‌కే వస్తాం..

ఇటీవల పాన్ ఇండియా స్థాయి సినిమాలతో హిట్‌ కొట్టిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ సంస్థ టైగర్ నాగేశ్వరరావు సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా దేశవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే దసరాకు టైగర్ నాగేశ్వరరావు సినిమాను విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించింది. అక్టోబర్ 20న ‘టైగర్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పింది. అయితే అదే సమయంలో పలు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు వాయిదా పడొచ్చన్న వార్తలు బయటికి వచ్చాయి. దీంతో ఈ పుకార్లపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. గతంలో ప్రకటించిన తేదీకే సినిమా రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.  ‘‘అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమా రిలీజ్ కాదంటూ కొన్ని నిరాధారమైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మా సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొనడంతోనే కొన్ని శక్తులు పుకార్లు వ్యాప్తి చేస్తున్నాయి. రూమర్లను నమ్మొద్దు. అక్టోబరు 20 నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద వేట ప్రారంభమవుతుంది” అని మేకర్స్ ప్రకటన చేశారు.

త్వరలోనే టీజర్ విడుదల

టైగర్ నాగేశ్వరరావు సినిమాను కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లను కొన్ని నెలల కిందటే మొదలుపెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోను రాజమండ్రిలో గోదావరిపై నిర్మించిన ఐకానిక్ బ్రిడ్జిపై ఆవిష్కరించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నుపూర్ సనన్‌తోపాటు గాయత్రి భరద్వాజ్‌ నటిస్తున్నారు. ఆర్.మధీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్‌‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా మాటల రచయిత.  

ఎవరీ టైగర్ నాగేశ్వరరావు?

ఏపీలోని బాపట్ల సమీపంలో ఉండే స్టువర్టుపురానికి ఓ ప్రత్యేకత ఉంది. అప్పట్లో దొంగతనం ఎక్కడ జరిగినా ఈ ఊరి పేరు వినిపించేది. అందుకే ‘స్టువర్టుపురం దొంగలు’ అనే పేరు పడిపోయింది. టైగర్‌‌ నాగేశ్వరరావు కూడా ఈ ఊరి వ్యక్తే. ఆయన అసలు పేరు గోకరి నాగేశ్వరరావు. ఈయన్ను ఆంధ్రా రాబిన్ హుడ్ అని కొందరు చెబుతారు. నాటి పోలీసుల రికార్డుల ప్రకారం.. స్టువర్టుపురంలోని పేరు మోసిన దొంగల్లో టైగర్ ఒకరు. ఓ దొంగల ముఠాకు నాయకుడు అని కూడా చెబుతారు.

1974లో బనగానపల్లెలో జరిగిన బ్యాంకు దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దోపిడీ విలువ అప్పట్లోనే రూ.35 లక్షలట. అర్ధరాత్రి బ్యాంకు వెనుకవైపు తలుపులు పగులగొట్టి దొంగలు లోపలికి వెళ్లారు. 14 కిలోల బంగారం, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు టైగర్ నాగేశ్వరరావు. నాడు పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టినా తప్పించుకున్నాడు. అయితే 1980 మార్చిలో పోలీసుల కాల్పుల్లో టైగర్ నాగేశ్వరరావు చనిపోయారు. అంతకుముందు ఎన్నోసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్న ఆయన.. ఓ ఎన్‌కౌంటర్‌‌లో మార్చి 24న మృతి చెందారు.

తన తమ్ముడు దొంగతనాల్లో సమర్థవంతంగా పాల్గొనేవాడని, కానీ సంపాదించినదంతా దానధర్మాలు చేసేవాడని టైగర్ నాగేశ్వరరావు అన్న ప్రభాకరరావు అన్నారు. తాము అందరం కలిసి దోపిడీ చేసినా సరే.. అంతా పంచిపెట్టేవాడని చెప్పారు. అప్పట్లో రూ.లక్షల్లో దొంగతనాల ద్వారా సంపాదించినా.. ఏమీ వెనకేసుకోకపోవడానికి కారణమిదేనని తెలిపారు. ప్రస్తుతం స్టువర్టుపురంలోనే ఓ చిన్న ఇంట్లో ఉంటున్నట్లు చెప్పారు.