తెలుగు సినిమాల్లో అడవి కూడా హీరోనే…

తెలుగు సినిమాలో అడవులకు చాలా ప్రాముఖ్యత ఉంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీల కాలం నుంచి ప్రస్తుతం కలర్‌ ‌మూవీల వరకు చాలా సినిమాలు అడవుల్లో షూటింగ్‌లు జరుపుకున్నాయి. విడుదలైన తర్వాత నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. కొన్ని సినిమాలు ఫెయిల్‌ అయ్యాయి. అనవసరంగా అడవిలో షూట్‌ చేయకుండా, కథలో కూడా అడవిని ఒక భాగం చేస్తూ డైరెక్టర్లు సినిమాలు తీసి, సక్సెస్‌ అయ్యారు. ఈ మధ్య కాలంలో కూడా అడవిలో షూటింగ్‌ జరుపుకొని సక్సెస్‌ అయిన […]

Share:

తెలుగు సినిమాలో అడవులకు చాలా ప్రాముఖ్యత ఉంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీల కాలం నుంచి ప్రస్తుతం కలర్‌ ‌మూవీల వరకు చాలా సినిమాలు అడవుల్లో షూటింగ్‌లు జరుపుకున్నాయి. విడుదలైన తర్వాత నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. కొన్ని సినిమాలు ఫెయిల్‌ అయ్యాయి. అనవసరంగా అడవిలో షూట్‌ చేయకుండా, కథలో కూడా అడవిని ఒక భాగం చేస్తూ డైరెక్టర్లు సినిమాలు తీసి, సక్సెస్‌ అయ్యారు. ఈ మధ్య కాలంలో కూడా అడవిలో షూటింగ్‌ జరుపుకొని సక్సెస్‌ అయిన సినిమాలు, ఫెయిల్‌ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో ఏదో ఒక సమయంలో అడవిలో సినిమా షూటింగ్‌ జరుపుకున్నారు. 

చిరంజీవి, అల్లు అర్జున్‌, జూనియర్‌‌ ఎన్టీర్‌‌, రామ్‌ చరణ్, వెంకటేశ్‌, రానా దగ్గుబాటి వంటి స్టార్లు గత కొన్నెండ్లుగా అడవిలోనే వారి సినిమా షూటింగ్‌లు జరుపుకొని, హిట్‌ కొట్టారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌‌ నటించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌, అల్లు అర్జున్‌ నటించిన పుష్ప, వెంకటేశ్‌ నటించిన నారప్ప సినిమాలు భారీ హిట్ అయ్యాయి. ఈ సినిమాల విజయం మరికొంత మంది నిర్మాతలకు వారి సినిమాలను అడవిలో తీయడానికి ప్రేరేపించాయి. 

అడవిలో షూటింగ్‌ అంటే అనేక సవాళ్లు…

పుష్ప1, 2  సినిమాలు చాలా భాగం అడవుల్లో షూటింగ్‌ జరుపుకున్నాయి. ఈ సినిమాలో అడవి అంతర్భాగం కాబట్టి, షూటింగ్‌ను అడవిలో జరుపుతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ అంశంపై కథ నడుస్తుంది కాబట్టి, ఈ సినిమాను ఎక్కువ భాగం అడవిలోనే చిత్రకరించారు. అడవికి నష్టం కలగకుండా, అడవి అందాలను చక్కగా చూపిస్తూ షూట్‌ జరిపారు.  ఈ మూవీని రాజమండ్రి సమీపంలోని దట్టమైన అడవి, చిత్తూరులోని శేషాచలం, వికారాబాద్‌ అడవుల్లో చిత్రీకరించామని సినిమా ప్రొడ్యూసర్‌‌ రవిశంకర్‌‌ తెలిపాడు. ‘‘ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లర్ల చుట్టూ తిరుగుతుంది కాబట్టి, అసలైన అడవుల్లోనే చిత్రీకరించాల్సి వచ్చింది. అడవిలో షూటింగ్ చేయడం సవాళ్లతో కూడుకున్న పని. అలాగే ఖర్చు కూడాచాలా ఎక్కువ. చాలా ఖర్చు పెట్టి ఈ సినిమా చేశాం. మేము అనుకున్న ఫలితాన్ని సాధించాం. సినిమా రిలీజ్‌ అయ్యాక అభిమానులు బ్రహ్మరథం పట్టారు” అని రవిశంకర్‌‌ అన్నారు. 

సక్సెస్‌ అవ్వకపోతే డబ్బు వృథా..

పుష్పతో పాటు ఇటీవల విడుదలైన చాలా సినిమాలు అడవిలోనే షూటింగ్‌ జరుపుకున్నాయి.అందులో చిరంజీవి ఆచార్య, రానా విరాటపర్వం, వైష్ణవ్‌ తేజ్‌ కొండపొలం, రానా అరణ్య లాంటి సినిమాలు దట్టమైన అడవి ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆయా సినిమాల్లో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ ఉంది.బ్యాక్‌డ్రాప్‌ ఉంది. కానీ, ఈ సినిమాలు బాక్సపీస్‌ వద్ద పర్వాలేదనిపించాయి. అడవుల నేపథ్యంలో సినిమాలు తీసి, సక్సెస్‌ కాకపోతే సమయం, డబ్బు వృథా అవుతుంది అని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు.

వర్షాకాలంలో భయం భయం..

మరో నిర్మాత సురేశ్‌ బాబు అడవుల్లో షూటింగ్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. దట్టమైన అడవుల్లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఖర్చు పెరుగుతుందని అని అన్నారు. ‘‘ఇలాంటి లొకేషన్లలో షూటింగ్‌ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. స్క్రిప్ట్ డిమాండ్‌ చేస్తేనే అడవుల్లోకి వెళ్లాలి. నిజానికి 1990లో వెంకటేశ్‌ నటించిన ‘బొబ్బిలి రాజా’ అనే సినిమాచేశాం. ఆ సమయంలోనే మాకు విపరీతంగా ఖర్చు అయింది. సినిమా సక్సెస్‌ కావడంతో మా డబ్బులు మాకు తిరిగి వచ్చాయి. ఇటీవల తీసిన నారప్ప సినిమాను అనంతపురం జిల్లా సమీపంలోని అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం” అని చెప్పారు. 

 ‘‘మరోవైపు, ఖర్చు కోసం కాకుండా అడవిలో ఉన్న వన్యప్రాణుల గురించి ఆలోచన చేయాలి. ఏ వైపు నుంచి ఏ జంతువు వస్తుందో గమనిస్తూ ఉండాలి. వర్షాకాలంలో అడవిలో షూటింగ్‌ అంటే చాలా రిస్క్‌ తో కూడుకున్నది. వర్షాకాలంలో యూనిట్‌ సభ్యులకు జలగల గురించి ఎక్కువ భయం ఉంటుంది. అలాగే, పాములు, కొన్ని రకాల కీటకాలు, పురుగులు పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. షూటింగ్ కోసం అని చెప్పి మనం వాటి భూభాగంలో చొరబడుతున్నాం కాబట్టి.. అక్కడ  షూటింగ్‌ జరిగినన్నీ రోజులు జాగ్రత్తగా ఉండాలి” అని సురేశ్‌ బాబు పేర్కొన్నారు. 

అడవి అందం సాటిలేనిది, భయాందోళనలు అధిగమించి, ప్రకృతి అందాలను తీయాలని డైరెక్టర్‌‌ వేణు ఊడుగల అన్నారు. ‘‘ప్రతి అడవికి దాని సొంత కథ ఉంటుందని నేను నమ్ముతాను. దాని కళ్ల ముందు జరుగుతున్న అనేక మంచి,చెడులకు అడవిలోని చెట్టుచేమ పుట్ట ప్రేక్షకులుగా మిగిలిపోతాయి” అని ఆయన పేర్కొన్నారు.