ఇండియన్ సినిమాపై బయోపిక్..!

ఎస్ ఎస్ రాజమౌళి… తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపును కైవసం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు జక్కన్న నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అదేదో రాజమౌళి మహేశ్ సినిమా కాదు. మేడ్ ఇన్ ఇండియా అంటూ… ఓ బయోపిక్ ను రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే… భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ […]

Share:

ఎస్ ఎస్ రాజమౌళి… తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపును కైవసం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు జక్కన్న నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అదేదో రాజమౌళి మహేశ్ సినిమా కాదు. మేడ్ ఇన్ ఇండియా అంటూ… ఓ బయోపిక్ ను రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే…

భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ అడుగు వేశారు. ‘మేడ్ ఇన్ ఇండియా’కు శ్రీకారం చుట్టారు. ఆయన సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. భారతీయ సినిమాకు పునాది ఎక్కడ పడింది, ఆ తర్వాత ఏ విధంగా ఎదిగింది వంటి విషయాలను సినిమాలో చూపించనున్నారు. ఇండియా సినిమాకు నివాళిగా ‘మేడ్ ఇన్ ఇండియా’ తెరకెక్కించనున్నారు. కథ, కథనాలతో పాటు విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయని సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా అర్థం అవుతోంది.

మాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని ఉన్నత నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మరాఠీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సహా పలు భారతీయ  భాషల్లో సినిమా విడుదల కానుంది. రాజమౌళి గతంలో విశాఖ ఎక్స్‌ప్రెస్, బ్రహ్మాస్త్ర సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.

రాజమౌళి విషయానికొస్తే.. గతేడాది ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రీసెంట్‌గా 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో అత్యధిక అవార్డులను కైవసం చేసుకుంది. ఇక రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమాను ‘మేడ్ ఇన్ ఇండియా’ కాకుండా.. మేడ్ ఇన్ భారత్ పెడితే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండియా అనేది బ్రిటిష్ బానిస మనసతత్వాన్ని ప్రతిబింబిస్తోందనే ముచ్చట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఇక రాజమౌళి సమర్పణలో తెరకెక్కే ‘మేడ్ ఇన్ ఇండియా’ మూవీలో భారతీయ సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది.. ఆ తర్వాత ఎలా ఎదిగింది అనేది ఈ సినిమాలో ప్రస్తావించనున్నారు. ఇక భారతీయ సినిమా విషయానికొస్తే.. మౌనంగా (మూకీగా) మొదలై.. తర్వాత మాటలు నేర్చి.. అటుపైన రంగులద్దుకుని.. ఆనక ఆటలు ఆడి.. పాటలు నేర్చి.. ఈ వందేళ్లలో ఎన్నో అడుగులు వేసింది.. మన భారతీయ సినిమా. రీల్స్ నుంచి డిజిటల్ వరకు ఎన్నో రూపాంతరాలు చెందింది.

వందేళ్లకు పైగా కొనసాగుతున్న భారతీయ సినిమాలో.. తెలుగు సినిమా భాగస్వామ్యం అసాధారణమైంది. 1913 నుంచి 2023 వరకూ భారతీయ సినిమాలో తెలుగు సినిమా పాత్ర మరువలేనిది. రఘుపతి వెంకయ్య నాయుడు నుంచి బి.ఎన్.రెడ్డి, కమలకర కామేశ్వరరావు, ఆదుర్తి, విఠలాచార్య నుంచి  రాంగోపాల్ వర్మ, రాజమౌళి వరకూ ప్రతి ఒక్కరూ తమదైన క్లాస్ ప్రదర్శించి భారతీయ ప్రేక్షకులను అలరించారు. అటు భారతీయ సినిమాలో హిందీ చిత్ర పరిశ్రమలో  దాదాసాహెబ్ ఫాల్కే నుంచి బిఆర్ చోప్రా, మన్మోహన్ దేశాయ్, యశ్ చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ వరకు ఎంతో మంది భారతీయ సినిమాను తమ వంతు సాయం అందించారు. మరి రాజమౌళి సమర్ఫణలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కేవలం హిందీ సినిమాలకే పరిమితమవుతారా లేదా ఇతర భాషలకు చెందిన అంశాలను సృశిస్తారా అనేది  చూడాలి.