రూ.100 నాణెం ఆవిష్కరణకు హాజరుకాని ఎన్టీఆర్

దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్మారకార్థం రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమవుతోంది. భారతీయ సినీ చరిత్రలో శిఖరం లాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడి పాత్రల్లో ఒదిగిపోయి.. దేవుళ్లు అంటే ఇలానే ఉంటారేమో అనిపించేంత నిండైన రూపం. అలా తెలుగు సినీ వినీలాకాశంలో వెలుగుతూనే ఉండే ధ్రువతార ఆయన. రాజకీయ నాయకుడిగానూ చెరిగిపోని ముద్ర వేశారు. పార్టీ స్థాపించిన […]

Share:

దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్మారకార్థం రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమవుతోంది.

భారతీయ సినీ చరిత్రలో శిఖరం లాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడి పాత్రల్లో ఒదిగిపోయి.. దేవుళ్లు అంటే ఇలానే ఉంటారేమో అనిపించేంత నిండైన రూపం. అలా తెలుగు సినీ వినీలాకాశంలో వెలుగుతూనే ఉండే ధ్రువతార ఆయన. రాజకీయ నాయకుడిగానూ చెరిగిపోని ముద్ర వేశారు. పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అలాంటి వ్యక్తిని గౌరవించుకుంటూ, స్మారకంగా రూ.100 వెండి నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ దాదాపుగా హాజరయ్యారు. కానీ హరికృష్ణ కుటుంబం నుంచి ఎవరూ వెళ్లలేదు. తన తాత పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌ వెళ్లకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.  

ఎందుకు రాలేదు?

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా ఆర్ఆర్ఆర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని అప్పట్లో ఆయన తెలియజేశారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు రామ్‌చరణ్‌ హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తాజాగా స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరయ్యారు. తాను హాజరుకాకపోవడానికి కారణం చెబుతూ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. జూనియర్‌‌కు ఆహ్వానం అందిందని, అయితే వ్యక్తిగత కారణాలతో ఈ ఈవెంట్‌ను స్కిప్ చేశారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతోనే హాజరుకాలేపోయారని ప్రచారం సాగుతోంది. మరి కల్యాణ్‌రామ్‌ ఎందుకు గైర్హాజరయ్యారనే ప్రశ్నలకు సమాధానం లేదు. 

లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడంపై వివాదం

స్మారక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించినా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోగా.. లక్ష్మీపార్వతి హాజరుకావాలనుకున్నా ఆహ్వానించలేదు. తాను ఎన్టీఆర్ భార్యనని, తనను ఎందుకు ఆహ్వానించరని, ఇది అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం విడుదల చేయడం సంతోషంగా ఉందని, కానీ తనను పిలవకపోవడం బాధగా అనిపిస్తోందని అన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం తప్పు. ఇన్విటేషన్ చూస్తే.. ప్రైవేటు ఫంక్షన్‌కు రాష్ట్రపతి గెస్ట్‌గా వెళ్తున్నట్లు ఉంది. ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం అన్యాయం. ఆయన ప్రాణాలు తీసిన వాళ్లు వారసులుగా చెలామణి అవుతున్నారు. ఎన్టీఆర్ భార్యగా.. ఆ నాణెం అందుకోవడానికి అర్హత నాకే ఉంది. వాళ్లకు లేదు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్లు నాణెం విడుదల కార్యక్రమానికి వెళ్లారు” అని తీవ్రంగా విమర్శించారు. ఎన్టీఆర్‌‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారని ఆరోపించారు. నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై తాను రాసిన లేఖలకు సమాధానం రాలేదని, అందుకే ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుస్తానని చెప్పారు.

కాయిన్ ధర రూ.4 వేలు పైనే

ఎన్టీఆర్ ఫొటో ఉన్న 100 రూపాయల స్మారక నాణెం నిన్నటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇవి చెలామణిలో ఉండవని, కొన్నింటిని మాత్రమే రిలీజ్ చేస్తారని సమాచారం. ఒక్కో కాయిన్ ధర రూ.4 వేలకు పైనే అని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ కాయిన్ తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో జనం పోటీ పడుతున్నారు. రూ.100 కాయిన్‌ను 44 మిల్లీమీటర్ల డయామీటర్‌‌లో తయారు చేశారు. 50 శాతం సిల్వర్, 40 శాతం కాపర్, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో రూపొందించారు. కాయిన్‌కు ఒకవైపు మూడు సింహాలు, అశోక చక్రం ఉండగా.. ఇంకోవైపు ఎన్టీఆర్ ముఖచిత్రం ఉంది. ‘నందమూరి తారక రామారావు శత జయంతి’ అని దానిపై ఇంగ్లిష్, హిందీలో రాసుకొచ్చారు. 1923–2023 అని సంవత్సరాలను ముద్రించారు.