Ranbir Kapoor: సందీప్ వంగా కథ చెప్పగానే బాత్‌రూంకి పరిగెత్తా..

‘యానిమల్’పై రణ్‌బీర్ కపూర్

Courtesy: Twitter

Share:

Ranbir Kapoor: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో (Ranbir Kapoor) ‘యానిమల్’ (Animal) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా గురించి తాజాగా రణ్‌బీర్ కపూర్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) శైలి ఎలా ఉంటుందో ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమా ద్వారా ప్రేక్షకులు చూశారు. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పేశారు. ఇదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి అక్కడి ప్రేక్షకులను కూడా కట్టిపడేశారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తోన్న మూడో సినిమా ‘యానిమల్’ (Animal). బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి. జనవరిలో విడుదలైన ‘యానిమల్’(Animal) ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

‘యానిమల్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రణ్‌బీర్ కపూర్ లుక్ అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒళ్లంతా రక్తం, సంకలో రక్తంతో తడిసిన గొడ్డలి పెట్టుకుని సిగరెట్ వెలిగించుకుంటున్న రణ్‌బీర్ లుక్ చూసి కొందరు భయపడ్డారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత వైల్డ్‌గా రణ్‌బీర్ ఈ పోస్టర్‌లో కనిపించారు. సినిమా ఎలా ఉండబోతోందో ఈ ఒక్క పోస్టర్‌తో చెప్పేశారు దర్శకుడు సందీప్ వంగా(Sandeep Vanga). అయితే, సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే హీరో రణ్‌బీర్ కపూర్ భయపడ్డారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘యానిమల్ స్క్రిప్ట్ మొదటిసారి విన్నప్పుడు.. నాకు ఇంకా గుర్తుంది.. డైరెక్టర్ సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేయడం పూర్తికాగానే నేను నా బాత్‌రూంలోకి వెళ్లాను. నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. చాలా భయపడ్డాను. ఒక స్టోరీ, ఒక పాత్ర గురించి విని నేను భయపడటం ఇదే తొలిసారి. సినిమా చాలా బాగా వస్తోంది. సందీప్‌తో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇదొక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా(Gangster Drama). తండ్రీకొడుకుల ప్రేమకథ. ఆగస్టు 11న ఈ సినిమా విడుదలవుతోంది. ఇంకా 25 నుంచి 30 రోజుల షూటింగ్ మిగిలి ఉంది’ అని రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) వెల్లడించారు.

మొత్తానికి సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) చాలా విరామం తరవాత తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఆడియన్స్‌కు మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో కిక్ ఇవ్వబోతున్నారు. అయితే, ‘యానిమల్’ (Animal) కథను మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుకు సందీప్ చెప్పారట. అప్పుడు ‘డెవిల్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను రణ్‌బీర్ దగ్గరకు తీసుకెళ్లారు సందీప్. ఈ సినిమాను రణ్‌బీర్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, రష్మిక మందన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

‘యానిమల్’తో పాటు ‘తు ఝోతి మై మక్కర్’ అనే సినిమాలోనూ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తరవాత రణ్‌బీర్ కపూర్ విరామం తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే, ఈ రెండు సినిమాల తరవాత మరో ప్రాజెక్ట్‌కు ఆయన సైన్ చేయలేదట. ఈ విషయాన్ని ఆయనే ఇంటర్వ్యూలో తెలిపారు. నటుడిగా తన స్థానం ఏంటో తెలుసుకోవడానికి ఈ విరామం తీసుకుంటున్నానని రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) అన్నారు. 2018లో ‘సంజు’ (Sanju) సినిమా వచ్చిన తరవాత కూడా ఇలానే నాలుగేళ్లు విరామం తీసుకున్నారు రణ్‌బీర్. ‘సంజు’ తరవాత కిందటేడాది వరుసగా ‘షంషేరా’, ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.