రజనీ సినిమాకు నాని నో చెప్పాడా?

భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్. ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లే. వయసు పెరుగుతున్నా.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 1980 నుంచి ఇప్పటిదాకా కొన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వాళ్లకు సాధారణ ప్రజల్లోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలోనూ వీరాభిమానులు ఉంటారు. అమితాబ్, రజనీ లాంటి స్టార్లతో ఒక్కసారైనా కలిసి నటించాలని కలలు కంటుంటారు. ఒకవేళ అలాంటి చాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? టాలీవుడ్ నటుడు నాని ఇప్పుడు ఇదే చేశారంటూ ప్రచారం […]

Share:

భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్. ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లే. వయసు పెరుగుతున్నా.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 1980 నుంచి ఇప్పటిదాకా కొన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వాళ్లకు సాధారణ ప్రజల్లోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలోనూ వీరాభిమానులు ఉంటారు. అమితాబ్, రజనీ లాంటి స్టార్లతో ఒక్కసారైనా కలిసి నటించాలని కలలు కంటుంటారు. ఒకవేళ అలాంటి చాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? టాలీవుడ్ నటుడు నాని ఇప్పుడు ఇదే చేశారంటూ ప్రచారం జరుగుతోంది. రజనీ సినిమాలో ఓ పాత్ర కోసం చిత్ర బృందం సంప్రదించగా నో చెప్పారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

నాని నో చెప్పారా?

తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్‌‌గా గుర్తింపు పొందాడు నాని. జెర్సీ, దసరా వంటి సినిమాలతో, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కెరియర్‌‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తండ్రీకూతుళ్ల కథతో ‘హాయ్ నాన్న’ అనే ఓ ఎమోషనల్ సినిమా చేస్తున్నారు. మరోవైపు ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ సినిమాలో నటిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రతినాయకుడి ఛాయలు ఉన్న ఓ పాత్ర కోసం నానిని ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. అయితే తొలుత ఈ పాత్ర విషయంలో సుముఖంగానే ఉన్న నాని.. తర్వాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. విలన్ పాత్రలో నటించడం ఇష్టం లేక సినిమా నుంచి తప్పుకున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈ క్యారెక్టర్ మరో టాలీవుడ్ నటుడు శర్వానంద్‌ వద్దకు వచ్చినట్లు సమాచారం. ఇందులో నటించేందుకు శర్వానంద్‌ కూడా ఓకే చెప్పారని, చర్చలు తుది దశలో ఉన్నాయని కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

‘తలైవర్ 170’.. భారీ తారాగణం..

జ్ఞానవేల్ తెరకెక్కించే చిత్రంలో రజనీతోపాటు అమితాబ్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సూపర్‌‌స్టార్లు కలిసి నటించిన సినిమా ఇదే అవుతుంది. గతంలో అంధా కానూన్, హమ్ వంటి సినిమాల్లో రజనీ, బిగ్‌బీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ‘తలైవర్ 170’ (వర్కింగ్ టైటిల్).. సినిమాలో ఫీమేల్ లీడ్‌గా మలయాళ నటి మంజు వారియర్‌‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నెగటివ్‌ రోల్‌లో ఫహాద్ ఫాజిల్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు విలన్ పాత్ర కోసం నాని కన్నా ముందు మరో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్‌ను కూడా చిత్ర బృందం సంప్రదించిందని తెలుస్తోంది. ఈ మేరకు విక్రమ్‌ను జ్ఞానవేల్ కలిశారని, అయితే విలన్‌గా నటించేందుకు ఆయన తిరస్కరించారని సమాచారం. 

ఎందుకు తిరస్కరిస్తున్నారు?

ఇదిలాఉంటే.. నాని, విక్రమ్‌ తదితరులు విలన్‌ రోల్‌ను తిరస్కరించడానికి కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. వారిద్దరూ విలక్షణ నటులు. చాలెంజింగ్ పాత్ర వస్తే వదిలిపెట్టారు. అది కూడా రజనీకాంత్, అమితాబ్‌ కలిసి చేసే అవకాశం. విలన్‌గా అయితే నటనకు మంచి స్కోప్ ఉంటుంది. మరి ఎందుకు తిరస్కరించినట్లు? విలన్ పాత్ర అంత నెగటివ్‌గా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిజ జీవిత సంఘటనల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇందులో పోలీసు పాత్రలో రజనీ కనిపిస్తారని చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని, వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేస్తారని సమాచారం. పూర్తి వివరాల కోసం చిత్రబృందం ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే.