నాటు నాటు కొన్నేళ్లు గుర్తుండిపోతుందన్న ప్రధాని.. మరికొంతమంది సెలెబ్రిటీల అభినందనలు .. 

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం ఆర్ఆర్ఆర్. మార్చి 2022లో నాటు నాటు పాట విడుదల అయినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంది. తాజాగా 95వ అకాడమీ అవార్డ్స్ లో కూడా నాటు నాటు ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ పాటగా రికార్డు కొట్టేసింది. నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో తెలుగోడి రోమాలు మరోసారి నిక్కబొడుచుకున్నాయి.. ప్రపంచ చలన చిత్రంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డు.. తెలుగు పాటకు దక్కటం […]

Share:

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం ఆర్ఆర్ఆర్. మార్చి 2022లో నాటు నాటు పాట విడుదల అయినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంది. తాజాగా 95వ అకాడమీ అవార్డ్స్ లో కూడా నాటు నాటు ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ పాటగా రికార్డు కొట్టేసింది. నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో తెలుగోడి రోమాలు మరోసారి నిక్కబొడుచుకున్నాయి.. ప్రపంచ చలన చిత్రంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డు.. తెలుగు పాటకు దక్కటం పట్ల.. ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ట్వీట్ చేశారు. అంతేకాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. 

కొన్నేళ్లు గుర్తుండిపోతుంది: ప్రధాని మోదీ 

95వ ఆస్కార్ వేడుకలలో ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. నాటు నాటు పాపులారిటీ ప్రపంచవ్యాప్తమైందని చెప్పారు. ఈ విజయాన్ని అసాధారణమైనదిగా పేర్కొంటూ.. నాటునాటుకి ప్రపంచవ్యాప్త ఆధరణ ఉందని, ఇది రాబోయే సంవత్సరాలకు గుర్తుండిపోయే పాటగా ఉంటుందని, చరిత్రలో మరుపురాని పాటగా ఇది నిలిచిపోతుందని కితాబిచ్చారు. చంద్రబోస్, కీరవాణితో పాటు చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు అందుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందాన్ని మోదీ అభినందించారు. 

విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్గే కూడా ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ పాడిన ఈ పాట.. మార్చి 2022లో విడుదలైన వెంటనే అత్యంత ప్రజాదరణ పొందింది. మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు అయిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది. ఎం ఎం కీరవాణి, చంద్రబోస్‌కి ఆస్కార్‌ను ప్రధానం చేశారు.

చిరంజీవి, బాలకృష్ణ, పవన్ అభినందనలు..

నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం.. భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టమన్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగుజాతితో పాటు దేశం గర్వించదగిన విజయమని తెలిపారు. 

ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్ తీసుకెళ్లేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసలు దక్కాలన్నారు చిరంజీవి. ఇక నాటు నాటుకు ఆస్కార్ రావడం అందులో చరణ్ కూడా భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక తండ్రిగా గర్వపడుతున్నానని చిరంజీవి అన్నారు.‌ 

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌‌గా నిలిచిన నాటు నాటు గీతంలోని తెలుగు పదం నలుచెరుగుల ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారేత్తించ్చింది. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడమే కాకుండా.. అవార్డు పొందడంతో భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరిందని, ఇంతటి ఘనత పొందేలా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు రాజమౌళికి ఎన్టీఆర్, రామ్ చరణ్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ఎం ఎం కీరవాణి, చంద్రబోస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 

ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటుకి మరింత ఆదరణ పెరిగింది. అంతకుముందే నాటు నాటు సాంగ్స్ సోషల్ మీడియాలో యూట్యూబ్‌లో ప్రపంచ దేశాల్లో వైరల్ అయింది. ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన తర్వాత.. నాటు నాటు పాట గురించి ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. తాజాగా జపాన్ కి చెందిన ఓ డేటా ఎనలిస్ట్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం.. ఆస్కార్ వచ్చిన తరువాత అంతకు ముందు కంటే 10 రెట్లు ఎక్కువగా దీని గురించి సెర్చ్ చేస్తున్నారట. ఆస్కార్ వచ్చిన ఈ మూడు రోజుల్లోనే నాటు నాటు సాంగ్‌ని ఏకంగా 1105 శాతం మంది వివిధ దేశాల నుంచి గూగుల్ లో వెతికారట.