కొన్ని రాష్ట్రాల్లో ఆగస్టు 11 దాకా భారీ వర్షాలు, వరదలు

గత నెలలో ఎడతెరిపి లేని వానలు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షాలు కుంభవృష్టిగా కురిశాయి. దీంతో యమున సహా పలు నదులు పోటెత్తి ప్రవహించాయి. వరద ధాటికి కొన్ని రోజులపాటు ఢిల్లీ నీళ్లలో చిక్కుకుంది. ప్రఖ్యాత ఎర్రకోటను కూడా వరద తాకింది. ఇలాంటి వర్షాలు, వరదలను ఉత్తర భారతం గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదట. ఈ నేపథ్యంలో ఇప్పుడు […]

Share:

గత నెలలో ఎడతెరిపి లేని వానలు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షాలు కుంభవృష్టిగా కురిశాయి. దీంతో యమున సహా పలు నదులు పోటెత్తి ప్రవహించాయి. వరద ధాటికి కొన్ని రోజులపాటు ఢిల్లీ నీళ్లలో చిక్కుకుంది. ప్రఖ్యాత ఎర్రకోటను కూడా వరద తాకింది. ఇలాంటి వర్షాలు, వరదలను ఉత్తర భారతం గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదట.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఆగస్టు 11వ తేదీ దాకా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆకస్మిక వరదలు పోటెత్తుతాయని చెప్పింది. ఉత్తరాఖండ్‌లో రేపు అక్కడకక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. యూపీ, బీహార్, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వెల్లడించింది.

రేపు, ఎల్లుండి దంచుడే..

ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో 10న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర రాష్ట్రాల్లో 11న భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 

ఇదే సమయంలో వాతావరణ శాక కాస్త ఊరట కల్పించే విషయాన్ని చెప్పింది. వాయువ్య భారతదేశం, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు తలెత్తే అవకాశం ఉందని చెప్పింది. అస్సాం మేఘాలయ, తూర్పు బీహార్, పశ్చిమ బెంగాల్‌, సిక్కింలలోనూ వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లు పరిస్థితులను బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని చెప్పింది. 

ఆలస్యంగా వచ్చి.. అతలాకుతలం చేసి..

కొన్నేళ్లుగా నైరుతి రుతుపవనాలు సమయానికే వస్తున్నాయి. జున్ మొదటి వారంలో వచ్చి.. జులై, సెప్టెంబర్, అక్టోబర్‌‌లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువగా కురుస్తున్నాయి. కానీ సారి మాత్రం చాలా ఆలస్యంగా దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. జూన్ మూడో వారం దాకా ఎండలు మండిపోయాయి. ఎక్కడా వాన జాడే లేదు. చిలరించినట్లు చిన్నగా పడటమే తప్ప పెద్ద వర్షాలు పడలేదు. ఆలస్యంగా దేశంలోని ఒక్కో రాష్ట్రంలోకి ప్రవేశిస్తూ వచ్చిన నైరుతి రుతుపవనాలు.. ఏదో బాకీ పడినట్లుగా విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఉత్తరాదిని ముంచెత్తాయి. వరదలు పోటెత్తడంతో పదుల సంఖ్యలో చనిపోయారు. ఢిల్లీలోని వేలాది మంది లోతట్టు ప్రాంతాల ప్రాజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సహాయ పునరావాస ఏర్పాట్లు చేశారు.

మరోవైపు తెలంగాణలోనూ జులై ఆఖరులో వానలు విరుచుకుపడ్డాయి. జిల్లాలను అతలాకుతలం చేశాయి. వరంగల్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి తదితర జిల్లాలను ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదలకు 40 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పాడిపశువులను ఎంతో మంది కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. 

కాస్త గ్యాప్ ఇచ్చాయా?

వస్తూ రాగానే విరుచుకుపడిన వర్షాలు.. ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చాయి. ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా కురవడం లేదు. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో మళ్లీ ఎండలు నమోదవుతున్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ మళ్లీ వర్ష సూచన ఇస్తుండటంతో జనం భయపడిపోతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురిసి, వరద పోటెత్తితే కోలుకోవడం కష్టమని ఆందోళన చెందుతున్నారు.