రామ్ గోపాల్ వర్మకు షాక్.. అప్పటివరకు వ్యూహం మూవీని విడుదల చేయొద్దు!

Vyuham : దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దర్శకత్వంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది.

Courtesy: x

Share:

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దర్శకత్వంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. సినిమా విడుదల చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ కు సంబంధించిన రికార్డులు జనవరి 11 కల్లా సమర్పించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

‘వ్యూహం’ సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ నారా లోకేష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 26న హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ వేశారు. ఆయన  పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద గురువారం విచారణ చేపట్టారు. ఉదయం 11.45 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ నంద రాత్రి 11.30 తరువాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

చంద్రబాబు ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యూహం సినిమా ఉందని పిటిషన్‌లో లోకేష్ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ కు లబ్ధి చేకూరేలా ‘వ్యూహం’ సినిమా తీశారని లోకేష్ తెలిపారు. లోకేష్ పిటిషన్ పై హైకోర్టులో 5 గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. అయితే కోర్టులో విచారణ సందర్భంగా.. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధర్‌రావు, ఉన్నం శ్రవణ్‌కుమార్‌లు వాదనలు వినిపిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా చిత్రాలు నిర్మించి విడుదల చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని నిర్మాత, దర్శకుడు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో అయిదారు సినిమాలు తీసి.. వాటితో ఎలాంటి లాభం రాకపోయినా మళ్లీ తీస్తున్నారన్నారు. దీనికి ఒక నేత నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లుందని ఆరోపించారు. లోకేష్ అభ్యంతరాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.

కాగా, సినీ నిర్మాత తరపున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కేవలం ట్రయలర్‌ చూసి కోర్టును ఆశ్రయించి సినిమాను నిలిపివేయాలని కోరడం సరికాదన్నారు. సెన్సార్‌ బోర్డు తరఫున అదనపు ఏజీ పి.నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ ఒకసారి బోర్డు సర్టిఫికెట్‌ జారీ చేశాక కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించగా ఛైర్మన్‌ ద్వారా రివిజనల్‌ కమిటీకి సిఫారసు చేసినట్లు తెలిపారు. 10 మందితో కూడిన కమిటీ సినిమాను పరిశీలించి కొన్ని అంశాలను తొలగించాలని సూచించిందని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు ప్రస్తావనను, కొన్ని పేర్లను తొలగించాలని పేర్కొందన్నారు.

సెన్సార్ సర్టిఫికేట్ రద్దు కాలేదు వర్మ
వ్యూహం చిత్రానికి గతంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను నిరవధికంగా రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన వర్మ, తాజాగా ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. వ్యూహం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశాన్ని ఆయన ట్వీట్ లో ఒక్క ముక్కలో తేల్చిచెప్పేశారు. ఇందులో వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదని వర్మ తెలిపారు.