ర‌జినీకాంత్ క్రేజ్..

పండుగలు పబ్బాలు వచ్చినప్పుడో.. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడో.. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకో సెలవులొస్తుంటాయి.. కానీ ఇవేవీ లేకున్నా చెన్నై, బెంగళూరు లాంటి చోట్ల ఆఫీసులకు సెలవులు ఇచ్చేస్తుంటారు. ఎందుకో తెలుసా? ర‌జినీకాంత్ సినిమా విడుదలవుతోంది మరి! ఆయన సినిమా వస్తోందంటే సౌతిండియా బాక్స్ ఆఫీస్ బద్ధలు కావాల్సిందే. అందుకే తమ ఆఫీసులకు సెలవులు ప్రకటిస్తుంటాయి కంపెనీలు. ఇప్పుడు ర‌జినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో చెన్నై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు […]

Share:

పండుగలు పబ్బాలు వచ్చినప్పుడో.. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడో.. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకో సెలవులొస్తుంటాయి.. కానీ ఇవేవీ లేకున్నా చెన్నై, బెంగళూరు లాంటి చోట్ల ఆఫీసులకు సెలవులు ఇచ్చేస్తుంటారు. ఎందుకో తెలుసా? ర‌జినీకాంత్ సినిమా విడుదలవుతోంది మరి! ఆయన సినిమా వస్తోందంటే సౌతిండియా బాక్స్ ఆఫీస్ బద్ధలు కావాల్సిందే. అందుకే తమ ఆఫీసులకు సెలవులు ప్రకటిస్తుంటాయి కంపెనీలు. ఇప్పుడు ర‌జినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో చెన్నై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు హాలిడే ప్రకటించేశాయి.

అట్లుంటది మరి..

ఏడు పదుల వయసులోనూ.. డ్యాన్స్‌ పేరుతో స్టంట్లు చేసే హీరోలు ఉన్న ఇప్పటి తరంలోనూ రజనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఫ్లాపులు, హిట్లతో సంబంధం లేకుండా.. తన మేనరిజంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారాయన. పైగా నిరాడంబరంగా ఉండే శైలి కూడా ఆయన్ను ఎక్కువ మంది ఇష్టపడటానికి కారణం. రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న రజనీకాంత్ సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడులో అయితే రెండు రోజుల ముందే పండుగ మొదలైంది. ఈ నేపథ్యంలో జైలర్ విడుదలవుతున్న ఆగస్టు 10న సెలవులు ఇచ్చేశాయి. కర్ణాటక, కేరళలోని కంపెనీలు కూడా హాలిడే ఇస్తుండటం గమనార్హం. కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు ఉచితంగా మూవీ టికెట్లు తెచ్చి ఇస్తున్నాయి. 

ఇలా సెలవులు ప్రకటిస్తున్న, టికెట్లు ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘జైలర్ సినిమా విడుదల నేపథ్యంలో మా ఉద్యోగులకు ఈనెల 10న సెలవు ఇస్తున్నాం. వాళ్లకు ఉచితంగా టికెట్లు ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. మా తాతకు, మా తండ్రికి, మాకు, మా కొడుక్కి, మా మనుమడికి కూడా ఆయన ఏకైక సూపర్‌‌స్టార్” అంటూ రజనీకాంత్‌పై తమ అభిమానాన్ని చాటుకుందో కంపెనీ. హైదరాబాద్‌లోని ఓ కంపెనీ కూడా జైలర్ సినిమా విడుదల సందర్భంగా ఉద్యోగులకు హాలిడేని ప్రకటించింది. జైలర్ సినిమా టికెట్లను ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా అందిస్తున్నట్లు హైదరాబాద్‌లోని దేశీ ఫుడ్స్ ప్రొడక్స్ట్ ప్రకటించింది. దీంతో ‘అట్లుంటది మరి రజనీతోటి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎందుకు ఇలా?

రజనీకాంత్ సినిమా విడుదల అవుతుందంటే హడావుడి మామూలుగా ఉండదు. చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. దీంతో సినిమా విడుదల రోజు ఉద్యోగులు సెలవులు పెట్టేస్తున్నారు. ఒకవేళ సెలవు ఇవ్వకుంటే.. ఆరోగ్యం బాగా లేదనో, బైక్ చెడిపోయిందనో.. ఇలా రకరకాల కారణాలు చెప్పి ఆఫీసుకు డుమ్మాకొట్టిన ఘటనలు ఉన్నాయి. దీంతో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగుల దారిలోకి వచ్చాయి. రజనీ సినిమా రోజు సెలవు ప్రకటించి, టికెట్లు కూడా ఇస్తున్నాయి. దీంతో కొంచెం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ అని అనిపించుకుంటున్నాయి.  

రేపు గ్రాండ్ రిలీజ్

రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. రోబో తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా ఆయన రాలేదు. నిజానికి ఆ రోబో కూడా రజనీ స్థాయి కాదు. అయినప్పటికీ తర్వాత వచ్చిన కబాలి, కాలా, 2.0, పేట, దర్బార్, అన్నాత్తే తదితర సినిమాలు పెద్దగా ఆడలేదు. కాలా, దర్బార్ పర్వాలేదనిపించాయి. దీంతో ఇప్పుడు జైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. గతంలో నెల్సన్ తీసిన సినిమాలు విభన్నంగా ఉండటం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం, నువ్వు వస్తావయ్యా సాంగ్ సూపర్ హిట్ కావడంతో జైలర్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో రేపు బాక్స్ ఆఫీస్ బద్దలేనంటూ అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, మలయాళ నటుడు వినాయకన్, తమన్నా, రమ్యకృష్ణ, యోగబాబు తదితరులు నటిస్తున్నారు.