షారుక్ ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన బీజేపీ..  ఎందుకంటే..!

షారుక్ ఖాన్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. ఈ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు అస్త్రంగా మారింది. తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ సినిమాను విమర్శనాస్త్రంగా మార్చుకుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిబింబిస్తుందని విమర్శలు చేస్తోంది. జవాన్ సినిమా కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన అవినీతి, అక్రమాలతో కూడిన పాలనను బహిర్గతం చేస్తుందని సటైర్లు వేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి […]

Share:

షారుక్ ఖాన్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. ఈ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు అస్త్రంగా మారింది. తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ సినిమాను విమర్శనాస్త్రంగా మార్చుకుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిబింబిస్తుందని విమర్శలు చేస్తోంది. జవాన్ సినిమా కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన అవినీతి, అక్రమాలతో కూడిన పాలనను బహిర్గతం చేస్తుందని సటైర్లు వేసింది.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా జవాన్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘జవాన్ మూవీ 2004 నుంచి 2014 వరకు అవినీతి, విధాన పక్షవాతంతో నిండిన కాంగ్రెస్ పాలనను బహిర్గతం చేసింది. ఇందుకు మేము షారుఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ‘విషాద రాజకీయ గతాన్ని’ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం గుర్తుచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

భాటియా అంతటితో ఆగలేదు. పాత స్కాములను తవ్వి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అవినీతిమయం అన్నారు. 2009 – 14 మధ్య యూపీఏ-II హయాంలో జరిగిన సిడబ్ల్యూజి, 2G,  బొగ్గు కుంభకోణాలను ఎత్తి చూపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ‘క్లీన్ రికార్డ్’ను నిర్వహించిందని పేర్కొంది. గత తొమ్మిదిన్నరేళ్లలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదన్నారు.

సినిమాలో షారుక్ ఖాన్ చెప్పినట్లుగా ‘మేము చిన్నవాళ్లం, మేము మా ప్రాణాలను దేశం కోసం పణంగా పెట్టగలం. కానీ దేశాన్ని అమ్మే మీలాంటి వారికి కాదు’ అన్నారు.  కాంగ్రెస్ హయాంలో కనీసం 1.6 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎన్‌డీఏ ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు చేసిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 2.55 లక్షల కోట్లు జమ చేశామని ఆయన పేర్కొన్నారు. 

కాంగ్రెస్ తన డిఫాల్ట్ స్నేహితులకు రుణాలు మంజూరు చేసిందని, పరారీలో ఉన్న విజయ్ మాల్యా మునుపటి రుణాలను తిరిగి చెల్లించకపోయినా, మరింత రుణం అందించినందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జీకి ధన్యవాదాలు అంటూ గౌరవ్ భాటియా సటైర్లు వేశారు. షారుక్ ఖాన్ గతంలో, ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా జవన్ సినిమా తీశారని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమాలోని డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. రాజకీయ పార్టీలకు వారు అందించే విద్య, వైద్య సౌకర్యాల ఆధారంగా ఓటు వేయాలి. మతం, కులం పేరిట ఓటు వేయడం సరికాదు. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తారా? తమ కుటుంబానికి మెరుగైన వైద్యం అందిస్తారా? అని అడిగి ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని సినిమాలో షారుక్‌ చెప్పిన డైలాగ్‌ను గుర్తు చేశారు.

జవాన్ స్టోరీ ఏంటంటే?

అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ చిత్రం తండ్రీ కొడుకుల కథ చుట్టూ తిరుగుతుంది. షారుక్ ఖాన్ డ్యూయల్ రోల్ చేశారు. సైనికుడిగా, రొమాంటిక్ హీరోగా, రాబిన్ హుడ్ స్టైల్ హీరోగా నటించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య ఉన్న బంధాన్ని వివరించేలా సినిమా ఉంటుంది. రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలు ఎలా ప్రభావితం చేస్తారు. రాజకీయ నాయకులకు ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తుందో ఈ చిత్రంలో ఉంటుంది. 

బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్న ఈ చిత్రం, అవినీతి, ప్రభుత్వ ఉదాసీనత, రైతుల ఆత్మహత్యలు, ఆక్సిజన్ కొరత కారణంగా ఆసుపత్రిలో చనిపోతున్న పిల్లలు, సైనిక ఆయుధాలు, నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు వంటి అనేక తీవ్రమైన సమస్యలను ఎత్తిచూపింది. ఓ కీలక సన్నివేశంలో సామాన్య ప్రజలు మేలైన, ఉత్తముడైన నాయకుడిని ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకోవాలని చెబుతారు.