14 రోజుల రిమాండుకు Bigboss 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్

Bigboss 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ విధించడంతో ప్రశాంత్, ఆయన సోదరుడిని చంచల్ గూడ జైలుకి పోలీసులు తరలించారు.

Courtesy: x

Share:

బిగ్‌బాస్‌ 7 సీజన్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో ఏ–1, ఏ–2 నిందితులుగా ఉన్న బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్‌ను బుధవారం రాత్రి వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్గూరులో పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం అతడి స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. అనంతరం ఇతడిని నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ విధించడంతో ప్రశాంత్, ఆయన సోదరుడిని చంచల్ గూడ జైలుకి పోలీసులు తరలించారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ ఎస్‌ఎస్‌ఐ మెహర్‌ రాకేశ్‌ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కారు డ్రైవర్లు సాయికిరణ్, ఎ.రాజుపై కేసు నమోదు చేశారు.


బిగ్‌బాస్‌ ఫైనల్స్‌ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్‌ విన్నర్ గా నిలిచిన ప్రశాంత్‌ స్టూడియోస్‌ నుంచి బయటకు రాగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్‌దీప్‌ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్వినీ కారు అద్దాలను పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్‌ కారణమని తేల్చారు. ఈ కేసులో ఏ1 గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఏ2 గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఏ3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. అయితే, ఏ4 గా ఉన్న సాయికిరణ్, రాజులను ఈనెల 19న అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ప్రశాంత్‌ ఇంటివద్దకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మ, బంధువులు ఆందోళనకు గురయ్యారు.


దాడి ఘటనలో నా ప్రమేయం లేదు; ప్రశాంత్
అరెస్టుకు ముందు బుధవారం సాయంత్రం తన నివాసంలో తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, తానెక్కడా అభిమానులను రెచ్చగొట్టలేదని ప్రశాంత్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన వల్ల ఇబ్బందులు కలిగినట్లు భావిస్తే పోలీసులకు క్షమాపణ చెబుతున్నానని, అద్దాల ధ్వంసం ఘటనలో వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రశాంత్‌ స్పష్టం చేశారు.