నార్వేలో బాహుబలి రిలీజ్..!

బాహుబలి.. తెలుగు సినీ చరిత్రను విశ్వవ్యాప్తం చేసిన సినిమా. బాహుబలి–1 సంచలన విజయం సాధిస్తే.. రెండో భాగం తిరుగులేని రికార్డులను కొల్లగొట్టింది. దేశంలో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ‘ఈగ’ సినిమాతో అప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రాజమౌళి.. బాహుబలితో హిందీ బెల్ట్‌లో హీరో రేంజ్‌లో అభిమానాన్ని పొందారు. సినిమా విడుదలై 8 ఏళ్లు గడిచినా ఇంకా.. బాహుబలి మేనియా తగ్గలేదు. ఎక్కడో ఒకచోట ఈ చిత్రం గురించిన చర్చ జరుగుతూనే ఉంది. అందుకు ఉదాహరణే […]

Share:

బాహుబలి.. తెలుగు సినీ చరిత్రను విశ్వవ్యాప్తం చేసిన సినిమా. బాహుబలి–1 సంచలన విజయం సాధిస్తే.. రెండో భాగం తిరుగులేని రికార్డులను కొల్లగొట్టింది. దేశంలో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ‘ఈగ’ సినిమాతో అప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రాజమౌళి.. బాహుబలితో హిందీ బెల్ట్‌లో హీరో రేంజ్‌లో అభిమానాన్ని పొందారు. సినిమా విడుదలై 8 ఏళ్లు గడిచినా ఇంకా.. బాహుబలి మేనియా తగ్గలేదు. ఎక్కడో ఒకచోట ఈ చిత్రం గురించిన చర్చ జరుగుతూనే ఉంది. అందుకు ఉదాహరణే తాజా ఘటన. 

నార్వేలో చిత్ర ప్రదర్శన

ప్రస్తుతం హీరోల గత చిత్రాల రీ రిలీజ్ ట్రెండ్‌ నడుస్తోంది. వరుసగా టాప్ హీరోల పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి కూడా రీ రిలీజ్ అవుతోంది. థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇండియాలో కాదులేండి.. విదేశాల్లో.  నార్వేలోని స్టావెంజర్ ఒపేరా హౌస్‌లో నిర్వహిస్తున్న సినీ వేడుకల్లో ఈ మేరకు బాహుబలిని ప్రదర్శించనున్నారు. 

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి నార్వేలో దిగిన ఫొటోను ఆయన షేర్ చేశారు. ‘‘బాహుబలి: ది బిగినింగ్ సినిమాను లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించడాన్ని ఎన్నటికీ మరిచిపోలేను.. ఇప్పటికీ నా కళ్లలోనే ఉండిపోయింది.  ఆగస్టు 18న నార్వేలోని స్టావెంజర్ ఒపేరా హౌస్‌లో నిర్వహించే ‘ఫిల్మ్ ఇన్ కన్సర్ట్’లో బాహుబలి ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. గతంలో 2019లో లండన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్‌లో బాహుబలిని ప్రదర్శించారు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ ప్రదర్శనకు రాజమౌళితోపాటు ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, ఎంఎం కీరవాణి, తదితర సినిమా యూనిట్‌లోని సభ్యులు హాజరయ్యారు. 

కొత్త చరిత్ర సృష్టించిన రాజమౌళి

భారతదేశ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమేననే భావన ఉన్న రోజులవి. టాలీవుడ్‌లో ఏదైనా సినిమాకు రూ.100 కోట్లు వస్తనే సూపర్‌‌హిట్ అనే పరిస్థితులు ఉండేవి. కానీ బాహుబలితో కొత్త చరిత్ర మొదలైంది. రూ.100 కోట్లు కాదు కదా.. రూ.వెయ్యి కోట్లతో దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపింది. రూ.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా రికార్డును సృష్టించింది. బాలీవుడ్‌కు సాధ్యం కాని ఫీట్‌ను తెలుగు సినిమా సాధించింది. బాహుబలి రెండు భాగాలు కలిసి రూ.1,500 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు ఇందుకు అదనం. ఇప్పటికీ టీవీలో బాహుబలి ప్రదర్శంచినా.. ఆసక్తిగా చూసే వాళ్లు ఎందరో. అంతలా జనాలకు నచ్చింది బాహుబలి.

ఆర్ఆర్ఆర్.. ఆస్కార్..

2017లో బాహుబలి రెండో భాగం రిలీజైంది. ఆ తర్వాత దాదాపు ఐదేళ్లకు 2022లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైంది. తెలుగు సినీ ప్రేక్షకులు అసలు కలలో కూడా ఊహించని రీతిలో.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌‌లతో మల్టీస్టారర్‌‌ను తెరకెక్కించాడు రాజమౌళి. బాహుబలితో ప్రభాస్‌ను దేశానికి పరిచయం చేస్తే.. ‘ఆర్ఆర్ఆర్‌’‌తో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌‌లను ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. మూడేళ్లకు పైగా షూటింగ్.. కరోనా కష్టాలను దాటుకుని 2022 మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆర్ఆర్ఆర్. ఇక ఆ తర్వాత మహా ప్రభంజనమే. కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టింది సినిమా. ఇవన్నీ ఒకెత్తు అయితే ఆర్ఆర్ఆర్ సాధించిన రికార్డులు మరో ఎత్తు. గోల్డెన్‌ గ్లోబ్‌తో మొదలై.. ఆస్కార్ అవార్డుతో తెలుగు సినీ పరిశ్రమ గర్వ పడేలా చేసింది. అస్కార్ అందుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచిపోయింది.