అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత.. పార్టీ లేదా పుష్పా!

‘పుష్ప’ సినిమాతో అంతర్జాతీయ పాపులారిటీ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘన సాధించారు. త్వరలో లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఆయన ఎంపికైన విషయం తెలిసిందే గంగోత్రి నుంచి పుష్ప దాకా తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇటీవల జాతీయ […]

Share:

‘పుష్ప’ సినిమాతో అంతర్జాతీయ పాపులారిటీ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘన సాధించారు. త్వరలో లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఆయన ఎంపికైన విషయం తెలిసిందే

గంగోత్రి నుంచి పుష్ప దాకా తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. ఏ తెలుగు నటుడికీ సాధ్యం కాని ఉత్తమ నటుడు అవార్డును సాధించి రికార్డులకెక్కారు. ఇప్పుడు ఆయన మరో ఘనతను అందుకోబోతున్నారు.

ఈ లిస్టులోకెక్కిన మరో తెలుగు హీరో

ప్రతిష్ఠాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విగ్రహానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్లు జరుగుతున్నాయని, కొలతలను ఇవ్వడం కోసం నేడో, రేపో లండన్‌కు అల్లు అర్జున్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పుష్ప–2 షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. అదే నిజమైతన ఈ ఘనతను అందుకున్న మరో దక్షిణాది నటుడిగా ఆయన నిలవనున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాదిలో అల్లు అర్జున్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

గతంలో బాలీవుడ్‌కు చెందిన మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, అనీల్ కపూర్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా, కత్రినా ఖైఫ్, కాజోల్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అథ్లెట్ మికా సింగ్ తదితరుల విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. 

ఏడాది తర్వాత ‘పుష్ప–2’

‘తగ్గేదే లే’ బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టాడు ‘పుష్ప’. 2021 డిసెంబర్‌‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌‌ హిట్ కొట్టింది. అల్లు అర్జున్ కెరియర్‌‌లో తొలిసారి పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై.. నార్త్ ప్రేక్షకులను అలరించింది. తొలుత నెగటివ్ టాక్ వచ్చినా.. తర్వాత జనాలు సినిమాకు పోటెత్తారు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు కూడా ‘తగ్గేదేలే’ మేనరిజాన్ని అనుకరించారంటే ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఇక పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ మ్యాచ్‌ల సందర్భంగానూ ‘ఊ అంటావా’ పాట వినిపించడం గమనార్హం. 

ప్రస్తుతం ‘పుష్ప – ది రూల్’ను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. తొలి పార్ట్‌కు మించి ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్‌‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్‌గా రష్మికా మందన్న, విలన్‌గా ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఇటీవల ‘ఓర్మాక్స్ మీడియా’ సంస్థ ఓ సర్వే చేసింది. బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల గురించి సర్వే నిర్వహించగా.. అందులో పుష్ప–2 తొలి స్థానంలో నిలిచింది. దీంతో ఈ సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. 2024 ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అదే సమయంలో అజయ్ దేవగణ్ ‘సింగమ్ అగైన్’ రిలీజ్ అవుతోంది.