రిలయన్స్ మరో సంచలనం త్వరలోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్

చాట్‌జీపీటీ లాంటి ఏఐని నిర్మించడంలో భారతీయులు విఫలమవుతారని ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్ అన్నారు. ఆయన మాటలను ముఖేశ్ అంబానీ సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఈ చాలెంజ్‌ను యాక్సిప్ట్ చేసినట్లు పరోక్షంగా ప్రకటించారు.  అతడు.. దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఓ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. భవిష్యత్‌ను ముందే అర్థం చేసుకోగల అనుభవశాలి. ఆయనే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఇతడు.. టెక్నాలజీ రంగంలోనే ఓ సంచలనం. ‘చాట్ జీపీటీ’ అంటూ ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను సృష్టించాడు. […]

Share:

చాట్‌జీపీటీ లాంటి ఏఐని నిర్మించడంలో భారతీయులు విఫలమవుతారని ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్ అన్నారు. ఆయన మాటలను ముఖేశ్ అంబానీ సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఈ చాలెంజ్‌ను యాక్సిప్ట్ చేసినట్లు పరోక్షంగా ప్రకటించారు. 

అతడు.. దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఓ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. భవిష్యత్‌ను ముందే అర్థం చేసుకోగల అనుభవశాలి. ఆయనే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ..

ఇతడు.. టెక్నాలజీ రంగంలోనే ఓ సంచలనం. ‘చాట్ జీపీటీ’ అంటూ ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను సృష్టించాడు. దేని గురించి అడిగినా క్షణాల్లోనే సమాచారమిచ్చేలా రూపొందించి టెక్ సంస్థలకు ముచ్చెమటలు పట్టించాడు. అతడే ‘ఓపెన్ ఏఐ’ సంస్థ అధినేత సామ్ ఆల్ట్‌మాన్.

తాను సాధించిన దానిపై ఆత్మ విశ్వాసం కాస్తా అతి విశ్వాసంలా మారింది. దీంతో తన చాట్‌జీపీటీ లాంటి దాన్ని తయారు చేయలేరన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆల్ట్‌మాన్. ఇండియన్ల విషయంలోనూ ఇలానే మాట్లాడాడు. ఈ సవాల్‌ను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ స్వీకరించారు. 

భారతీయులను తక్కువ చేసిన ఆల్ట్‌మాన్

చాట్‌జీపీటీ ఏఐ లాంటి వ్యవస్థను సృష్టించడానికి ఇండియన్లు ప్రయత్నించవచ్చు కానీ, అది వ్యర్థమేనని ‘ఓపెన్ఏఐ’ సీఈవో ఆల్ట్‌మాన్ అన్నాడు. రెండు నెలల కిందట భారతదేశంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చాట్‌జీపీటీతో పోల్చదగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టూల్‌ను అభివృద్ధి చేయడంలో ఇండియన్ల సామర్థ్యాన్ని ప్రశ్నించాడు. చాట్‌జీపీటీ లాంటి ఏఐ కోసం చేసే ప్రయత్నం వృథానే అని, అలాంటి దాన్ని సాధించడంలో భారతదేశం చాలా సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పుకొచ్చాడు.

గూగుల్ ఇండియా మాజీ చీఫ్, ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ రాజన్ ఆనందన్ అడిగిన ప్రశ్నకు ఆల్ట్‌మాన్ స్పందిస్తూ.. ‘‘చాట్‌జీపీటీతో పోటీపడటం దాదాపు అసాధ్యమైన పని. ఫౌండేషనల్ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడంలో మమ్మల్ని సవాలు చేయడం పూర్తిగా నిరుపయోగమని నేను మీకు స్పష్టంగా చెబుతున్నా. మీరు అలాంటి దాన్ని ప్రయత్నించకపోవడమే మంచిది” అంటూ ఏదో బ్రహ్మపదార్థాన్ని చేసినట్లుగా గొప్పలకు పోయాడు.

ఇండియాకు టాలెంట్ ఉందన్న అంబానీ

సోమవారం 46వ రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో మాట్లాడిన అంబానీ.. పరోక్షంగా ఆల్ట్‌మాన్ సవాలును స్వీకరించినట్లే ప్రకటించారు. భారతీయ వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ తరహాలో జియో కొత్త ఏఐ సిస్టమ్స్‌ను రూపొందిస్తుందని అంబానీ ప్రకటించారు. ‘‘జియో ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా ఏఐ ఇస్తుందని హామీ ఇస్తోంది. మేం ఇచ్చిన హామీని నెరవేరుస్తాం” అని చెప్పారు. ఏఐలో రాణించడానికి అవసరమైన వనరులు, నిబద్ధను భారతదేశం కలిగి ఉందని అన్నారు.

‘‘నిర్దిష్ట ఏఐ మోడల్స్, ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలకు నాయకత్వం వహించాలని జియో ప్లాట్‌ఫామ్స్‌ కోరుకుంటున్నాయి. తద్వారా భారతీయులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి ఒకేలా ఏఐని అందజేసేందుకు వీలు కలుగుతుంది.  భారతదేశానికి కావాల్సినంత విస్తృతి ఉంది.. భారతదేశానికి కావాల్సినంత డేటా ఉంది.. భారతదేశానికి కావాల్సినంత ప్రతిభ ఉంది” అని చెప్పుకొచ్చారు. 

దూసుకుపోతున్న జియో 

అంతర్జాతీయ ఏఐ ఆవిష్కరణలను వేగంగా అందిపుచ్చుకునేందుకు.. ప్రతిభ, సామర్థ్యాలకు సపోర్టు చేసేందుకు జియోలో సన్నాహకాలు సాగుతున్నాయి. ముఖ్యగా భారతదేశంలోని నిర్దిష్ట ఏఐ మోడల్స్, ఏఐ ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి నాయకత్వం వహించాలని జియో ప్లాట్‌ఫామ్స్‌ను యోచిస్తున్నాయిన అంబానీ తెలిపారు. ఏఐ ప్రయోజనాలను భారతీయ పౌరులు, బిజినెస్‌లు, ప్రభుత్వాలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘ఏడేళ్ల కిందట.. ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని ఇస్తామని జియో వాగ్దానం చేసింది. మేం దాన్ని నెరవేర్చాం. ఈ రోజు జియో ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా ఏఐని ఇస్తుందని మరోసారి వాగ్దానం చేస్తోంది. మేం దాన్ని కూడా నిలబెట్టుకుంటాం” అని రిలయన్స్ ఏజీఎంలో ముఖేశ్ అంబానీ ప్రకటించారు.