వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం..

గృహ రుణాలతోపాటు ఇతర ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి చిన్నపాటి గుడ్‌న్యూస్. కీలకమైన రెపో రేటులో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించేందుకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అందరు అనుకున్నట్లే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.  గవర్నర్‌ శక్తి కాంతదాస్‌ నేతృత్వంలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే రుణాలపై […]

Share:

గృహ రుణాలతోపాటు ఇతర ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి చిన్నపాటి గుడ్‌న్యూస్. కీలకమైన రెపో రేటులో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించేందుకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

అందరు అనుకున్నట్లే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.  గవర్నర్‌ శక్తి కాంతదాస్‌ నేతృత్వంలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎఫ్, బ్యాంకు రేట్లు సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు తెలిపారు. వడ్డీ రేట్లను మార్చకుండా ఇలాగే కొనసాగించడం ఇది వరుసగా నాలుగో సారి. అయితే, ఆగస్టుతో పోల్చితే ఈ సారి ద్రవ్యోల్బణం పెరిగింది. వృద్ధి ఆశాజనకంగానే ఉన్నా, అంతర్జాతీయ అంశాలు ప్రతికూలంగా మారాయి. కూరగాయలు, వంట గ్యాస్ ధరలు తగ్గిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం దిగి వచ్చే అవకాశాలున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. 

రిటైల్‌ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని  ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్‌ విక్రయాలను చేపడుతున్నట్లు తెలిపింది. సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కు తీసుకునే ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజుల పాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాకు తెలిపారు. ‘ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్‌ 2, మైనస్‌ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే.

పాలసీ రేట్లు ఇలా.. రెపో రేటు – 6.50%, ఎస్‌డీఎఫ్‌ఆర్‌- 6.25%, ఎంఎస్‌ఎఫ్‌ఆర్‌- 6.75%, బ్యాంక్‌ రేటు- 6.75%, రివర్స్‌ రెపో రేటు- 3.35%గా ఉన్నాయి. కాగా, ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతం, 2023-24 రెండో త్రైమాసికంలో 6.4 శాతం, 2023-24 మూడో త్రైమాసికంలో 5.6 శాతం, 2023-24 నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం, 2024-25 తొలి త్రైమాసికంలో 5.2 శాతం ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ 6.5 శాతంగా పేర్కొంది.

అయితే, ఆర్‌బీఐ 2022 మే నుంచి 250 బేసిస్‌ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లోద్రవ్య విధానాన్ని వెనక్కు తీసుకునే ధోరణినే కొనసాగించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉందని గవర్నర్ పేర్కొన్నారు.       

రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు..

రూ.2,000 నోట్లను అక్టోబర్‌ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్‌బీఐ కల్పించింది. గవర్నర్‌ ఈ విషయంపై మాట్లాడుతూ.. రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్‌ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయన్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు.  అక్టోబర్‌ 8 నుండి 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్‌ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన ఆర్‌బీఐ, ఈ తేదీని అక్టోబర్‌ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్‌బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్‌ శాఖ సేవలను పొందవచ్చని దాస్‌ సూచించారు.