ఇంకా ఐటీఆర్ దాఖలు చేయలేదా?

2022–23కి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్‌ (ఐటీఆర్)  దాఖలు గడువు జులై 31తో ముగిసింది. దీంతో కోట్ల మంది తమ ఐటీఆర్‌‌ను దాఖలు చేశారు. అయితే తెలియక కొందరు, సమయం లేక మరికొందరు, చేసే ఉద్దేశం లేక ఇంకెందరో ఐటీఆర్‌‌ను ఫైల్ చేయలేదు. మరి ఇప్పుడు వాళ్ల సంగతేంటి? ఐటీఆర్‌‌ను దాఖలు చేయకపోతే ఏమవుతుంది? గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్‌‌ను దాఖలు చేయడానికి వీలుందా? రికార్డు స్థాయిలో రిటర్న్స్‌ ఆదాయ పన్ను శాఖకు ఈ సారి రికార్డు […]

Share:

2022–23కి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్‌ (ఐటీఆర్)  దాఖలు గడువు జులై 31తో ముగిసింది. దీంతో కోట్ల మంది తమ ఐటీఆర్‌‌ను దాఖలు చేశారు. అయితే తెలియక కొందరు, సమయం లేక మరికొందరు, చేసే ఉద్దేశం లేక ఇంకెందరో ఐటీఆర్‌‌ను ఫైల్ చేయలేదు. మరి ఇప్పుడు వాళ్ల సంగతేంటి? ఐటీఆర్‌‌ను దాఖలు చేయకపోతే ఏమవుతుంది? గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్‌‌ను దాఖలు చేయడానికి వీలుందా?

రికార్డు స్థాయిలో రిటర్న్స్‌

ఆదాయ పన్ను శాఖకు ఈ సారి రికార్డు స్థాయిలో ఐటీఆర్‌‌లు దాఖలయ్యాయి. ఏకంగా 6.77 కోట్లకు పైగా రిటర్న్స్‌ను ఉద్యోగులు, ఇతర వర్గాల వారు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. గత ఆదివారం (జులై 30) అర్ధరాత్రి దాకా రిటర్నులను దాఖలు చేయడం కొనసాగింది. ఆ ఒక్క రోజే 27 లక్షల మందికి పైగా ఐటీఆర్‌‌ను ఫైల్ చేయడం గమనార్హం. చివరి రోజైన సోమవారం భారీగా ఐటీఆర్‌‌లు దాఖలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. సకాలంలో ఐటీఆర్‌‌లు ఫైల్ చేసినందుకు పన్ను చెల్లింపుదారులు, టాక్స్ ప్రొఫెషనల్స్‌ను అభినందించింది. రికార్డు స్థాయిలు రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. ‘‘జులై 31 నాటికి 6.77 కోట్ల ఐటీఆర్‌‌లు దాఖలయ్యాయి. గతడాదితో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. జులై 31న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 64.33 లక్షల రిటర్నులు ఫైల్ అయ్యాయి. మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో 53.67 లక్షల మంది తొలిసారి టాక్స్ రిటర్నులు ఫైల్ చేశారు” అని వివరించింది. 

గడువు దాటిన తర్వాత పరిస్థితేంటి?

ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారుల పలు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా దాఖలు చేసిన వారిపై జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. గడువు తర్వాత రిటర్న్స్‌ ఫైల్ చేసే వాళ్లు పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎన్ని రోజులు లేట్ చేశారు? మొత్తం పన్ను విలువ ఎంత? అనే దాన్ని బట్టి ఈ పెనాల్టీ మారుతుందని వివరిస్తున్నారు. 

ఆలస్యంగా దాఖలు చేస్తే ఇలా..

ఐటీఆర్‌‌ను ఆలస్యంగా దాఖలు చేస్తే గరిష్ఠంగా రూ.5 వేల దాకా పెనాల్టీ విధించే అవకాశం ఉంది. అది కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు.. గరిష్ఠంగా రూ.వెయ్యి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 తర్వాత ఫైల్ చేయాల్సి వస్తే మాత్రం భారీ పెనాల్టీని భరించాల్సిందే. ఈ మేరకు రూ.10 వేలను కట్టాల్సి ఉంటుంది.  

అసలు దాఖలే చేయకపోతే?

పన్ను చెల్లింపుదారులు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. డెడ్‌లైన్‌ను మిస్‌ అయితే.. పన్ను చెల్లింపు బాధ్యతలను మినహాయింపు దొరకుతుందని అనుకోవడం భ్రమ. ఐటీఆర్ ఫైల్ చేస్తేనే.. మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి. దీన్ని స్కిప్ చేయడం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. రిటర్నులను ఫైల్ చేయలేకపోతే.. చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్ చేయని వాళ్లు.. ఇకనైనా ఆ పని చేయాలి. పెనాల్టీ పడినా సరే.. ఐటీఆర్‌‌ను దాఖలు చేయలి. ఆదాయపన్ను శాఖ కూడా ఇదే చెబుతోంది. అర్హత గత పన్ను చెల్లింపుదారులు విధిగా ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలని కోరుతోంది.