టెస్లాలో డేటా లీక్.. మాజీ ఉద్యోగుల పనే..

ఎలాన్ మస్క్.. టెస్లా, స్పేస్‌ ఎక్స్, ట్విట్టర్ (ఎక్స్) సంస్థల అధినేత. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. కొన్ని నెలల కిందట ట్విట్టర్‌‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఆ సంస్థను గాడిలో పెట్టే పనిలో తలమునకలై ఉన్నారు. ట్విట్టర్‌‌లో సమూల మార్పులు చేస్తున్నారు. కానీ సంస్థ పరిస్థితి దారిలోకి రావడం లేదు. ఈ కథ ఇలా ఉండగానే.. ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. తన మానస పుత్రిక ‘టెస్లా’లో డేటా లీక్ అంశం కలకలం రేపుతోంది. […]

Share:

ఎలాన్ మస్క్.. టెస్లా, స్పేస్‌ ఎక్స్, ట్విట్టర్ (ఎక్స్) సంస్థల అధినేత. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. కొన్ని నెలల కిందట ట్విట్టర్‌‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఆ సంస్థను గాడిలో పెట్టే పనిలో తలమునకలై ఉన్నారు. ట్విట్టర్‌‌లో సమూల మార్పులు చేస్తున్నారు. కానీ సంస్థ పరిస్థితి దారిలోకి రావడం లేదు. ఈ కథ ఇలా ఉండగానే.. ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. తన మానస పుత్రిక ‘టెస్లా’లో డేటా లీక్ అంశం కలకలం రేపుతోంది. సంస్థలో పని చేసిన ఉద్యోగులే ఇందుకు కారకులను దర్యాప్తులో తేలింది. 

75 వేల మంది డేటా లీక్

మే నెలలో 75 వేల మందిని ప్రభావితం చేసిన డేటా లీక్ అంశం టెస్లా కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ నుంచి 75,735 మందికి సంబంధించిన డేలా లీక్ అయింది. ఇందులో వ్యక్తిగత సమాచారంతోపాటు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మైనే రాష్ట్ర అటార్నీ జనరల్ ప్రకటించారు. ఈ వ్యవహారం తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లు అమెరికా వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ డేటా లీక్ విషయంలో సంస్థకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగుల ప్రమేయం ఉందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 

మాజీ ఉద్యోగులే దెబ్బ కొట్టారు!

గతంలో కంపెనీలో పని చేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులు.. 75 వేల మందికి పైగా వ్యక్తుల వివరాలను విదేశీ మీడియా సంస్థకు లీక్ చేసినట్లు అంతర్గత దర్యాప్తులో తేలిందని టెస్లా తెలిపింది. టెస్లా ఐటీ భద్రత, డేటా రక్షణ విధానాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు మాజీ ఉద్యోగులు సమాచారాన్ని దుర్వినియోగం చేశారని విచారణలో వెల్లడైంది. ‘‘ఒక విదేశీ మీడియా సంస్థ (హ్యాండిల్స్‌బ్లాట్).. 2023 మే 10న టెస్లాకు చెందిన 75 వేల మంది రహస్య సమాచారాన్ని తీసుకున్నట్లు టెస్లాకే తెలియజేసింది. టెస్లా ఐటీ భద్రత, డేటా రక్షణ విధానాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు మాజీ ఉద్యోగులు సమాచారాన్ని దుర్వినియోగం చేశారని విచారణలో వెల్లడైంది. సదరు సమాచారాన్ని మీడియా సంస్థకు అందజేశారని తేలింది” అని టెస్లా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించి.. వారిపై దావా వేసినట్లు టెస్లా తెలిపింది. నిందితుల వద్ద ఉన్న ఎలక్ట్రానికి పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సీరియస్‌గా స్పందించిన ఎలాన్ మస్క్

ఈ వ్యవహారంపై కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మరోవైపు డేటా లీక్ ఘటనపై కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. కంపెనీ విశ్వసనీయతకు సంబంధించిన విషయం కావడంతో సీరియస్‌గా తీసుకున్నారు. తమ కంపెనీపై విదేశీ కుట్ర జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.

ఎలాన్ మస్క్ సెక్యూరిటీ నంబర్‌‌ కూడా లీక్!

టెస్లా డేటా ప్రైవసీ అధికారి స్టీఫెన్ ఎలెన్‌టుక్ మాట్లాడుతూ.. టెస్లా డేటాను మాజీ ఉద్యోగులు ఏ విధంగానూ వాడుకోకుండా ఉండేందుకు కోర్టు ఆదేశాలను పొందినట్లు తెలిపారు. భవిష్యత్తులో చర్యలు తీసుకునేలా కంపెనీ లా  ఎన్ఫోర్స్‌మెంట్, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పని చేస్తోందని తెలియజేశారు. మరోవైపు టెస్లా నుంచి లీకైన డేటాలో 2,400 వినియోగదారుల ఫిర్యాదులు, బ్రేకింగ్ సమస్యలు ఫిర్యాదులు, ఫాంటమ్‌ బ్రేకింగ్‌కు సంబందించిన సమస్యలవి ఉన్నాయి. ఎలాన్ మస్క్‌ సెక్యూరిటీ నంబర్‌‌ కూడా లీకైన డేటాలో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 100 జీబీ డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది.